ఒక్క వజ్రం ఆచూకీ ప్రపంచదేశాల పోలీసులకు సవాల్‌గా మారింది. ఫ్రాన్స్, లెబనాన్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, దుబాయ్, రష్యా ఇలా పలు దేశాల పోలీసులు చోరికి గురైన రూ.250 కోట్ల విలువైన పింక్ వజ్రాన్ని కనిపెట్టేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. నిందితులు పెద్ద స్ధాయికి చెందిన వ్యాపారస్ధులు కావడం, వారు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటుండటం కేసు దర్యాప్తును మరింత క్లిష్టతరం చేస్తోంది. తాజాగా ఈ కేసులో నలుగురు భారతీయ ఆఫ్రికన్లు జునైద్ మోతీ, అబ్బాస్ అబూబకర్ మోతీ, అష్రఫ్ కాకా, సలీం బొబట్‌లకు ఇంటర్‌పోల్ రెడ్ నోటీసులు జారీ చేసింది(ఇంటర్‌పోల్ రెడ్ నోటీసులు జారీ చేస్తే ఆ వ్యక్తిని ప్రపంచంలో ఎక్కడున్నా అరెస్టు చేసి తరలిస్తారు). దీంతో వారు నోటీసులను నిలిపివేయాలంటూ ప్రిటోరియా హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే వీరు ఫ్రాన్స్, లెబనాన్, జింబాబ్వే, దుబాయ్ కోర్టుల్లో వజ్రానికి సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నారు.