వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేటికి అయిదో రోజుకు చేరింది. ఒకవైపు దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా నానాటికీ మద్దతు వెల్లువెత్తుతుంటే... మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రజల్లో, అభిమానుల్లో, పార్టీ కార్యకర్తల్లోనూ ఆందోళనలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. పైగా ఈ విషయంలో జైలు అధికారుల వ్యవహార శైలి కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. జగన్ ఆరోగ్యానికి సంబందించి వివరాలు నిన్న సాయత్రం హెల్త్ బులెటిన్లో జైలు అధికారులు అందించారు. ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ నాలుగు రోజులుగా ఆహారం తీసుకోవపోవడంతో కొంచెం నిరసించిపోయినట్టు సమాచారం. జగన్‌కు అన్ని పరీక్షలూ జరిపించామని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఒకసారి, నీరసంగా ఉన్నారని మరోసారి... ఇలా జైలు అధికారులు రకరకాలుగా చెబుతున్న వైనం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. పైగా ఆయనకు జరిపిన పరీక్షల వివరాలను కూడా వెల్లడించకపోవడం, వారి వివరాలు రావాల్సి ఉందని, అప్పుడే ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం ఇవ్వగలమని చెబుతుండటం ఆందోళనను మరింతగా పెంచుతోంది. మరోవైపు జగన్ దీక్ష నేపథ్యంలో చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ను, ఐజీని తాత్కాలిక డీజీ సాంబశివరావు నిన్న తన నివాసానికి పిలిపించుకున్నారు. పరిస్థితులను సమీక్షించడంతో పాటు దీక్ష, దాని పరిణామాలపై చాలాసేపు చర్చించారని తెలుస్తోంది. జైలు ఆసుపత్రిలో ఒక స్థాయి వరకే వైద్యం సాధ్యమన్న అంశం కూడా చర్చకు వచ్చిందని చెబుతున్నారు. దాంతో దీక్షను భగ్నం చేసే దిశగా పథక రచన జరుగుతోందన్న అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి.
Published Thu, Aug 29 2013 10:28 AM | Last Updated on Wed, Mar 20 2024 1:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement