రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో చంచల్ గూడ సెంట్రల్ జైలు చుట్టుపక్కల భారీ భద్రతను ఏర్పాటు చేశారు. గత పదకొండు గంటలుగా జగన్మోహన్ రెడ్డి దీక్షను కొనసాగిస్తున్నారు. ఉదయం టీ, అల్పాహారం తీసుకోకుండా నిరాకరించారు. జగన్ దీక్షకు మద్దతుగా చంచల్‌గూడ జైలు ఎదుట ఇద్దరు మహిళల రిలే దీక్షలు చేపట్టగా అనుమతి లేదనే కారణంగా పోలీసులు అడ్డుకున్నారు. జైలు వద్ద సంఘీభావ దీక్ష చేపట్టిన వైఎస్ జగన్ అభిమానులను బలవంతంగా పోలీసులు అరెస్టు చేశారు. జగన్ నిరాహారదీక్ష నేపథ్యంలో చంచలగూడ వద్ద అదనపు పోలీసు బలగాలను, పారా మిలిటరీ దళాలను నియమించినట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమరదీక్షను పోలీసులు భగ్నం చేసి, గుంటూరులోని ఆస్పత్రికి తరలించిన తర్వాత జగన్ ఆమరణ దీక్షను ప్రారంభించారు. గత సంవత్సరం మే 27 తేది నుంచి చంచల్ గూడ జైలులో వైఎస్ జగన్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.