అపోలో ఆస్పత్రిలో 23 రోజులగా చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం శుక్రవారం నాటికి మరింత మెరుగుపడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చిన్నపాటి గొంతుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. లండన్ నుంచి వచ్చిన వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే, ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యుల బృందం రోజుకు రెండుసార్లు అపోలో వద్దకు వచ్చి జయ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. చికిత్సకు జయలలిత స్పందిస్తున్నందున అవసరమైనపుడు మాత్రమే వెంటిలేటర్‌ను అమరుస్తున్నారు.కాగా తమిళనాడు రాజకీయాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని హోంశాఖ ఉన్నతాధికారి స్పష్టం చేశారు.సీఎం జయ అనారోగ్యంపై అవమానకరంగా మాట్లాడిన నేరంపై కోయంబత్తూరు జిల్లాకు చెందిన సురేష్, రమేష్ అనే ఇద్దరు బ్యాంకు ఉద్యోగులను శుక్రవారం అరెస్ట్ చేశారు. జయలలిత ఆరోగ్యంపై దిగులుపెట్టుకున్న మరో ఇద్దరు అన్నాడీఎంకే కార్యకర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒకరు మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతున్నారు.