తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నిన్నటివరకు శశికళను ఏకగ్రీవంగా శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారని చెబుతుంటే.. తాజాగా ఆమెపై నిరసన స్వరాలు బయటకు వినిపిస్తున్నాయి. అన్నాడీఎంకే నేతలు పీహెచ్ పాండియన్, మనోజ్ పాండియన్ ఇద్దరూ శశికళకు వ్యతిరేకంగా మీడియాకు ఎక్కారు. దాంతోపాటు అసలు జయలలితది సహజ మరణం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోయస్‌గార్డెన్స్‌లో ఒకసారి జరిగిన గొడవలో జయలలితను కిందకు తోసేశారని, అందువల్లే ఆమె ఆస్పత్రి పాలయ్యారని అన్నారు. ఈ వ్యవహారాన్ని బయటపడకుండా జాగ్రత్త పడ్డారని, జయలలిత మరణంలో శశికళ పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అమ్మ మరణించిన తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో చిన్నమ్మ పెత్తనం పెరిగిపోయిందని, ఆమె ఆధిపత్యాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పాండియన్‌లు ఇద్దరూ చెప్పారు.