అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరి తెగించి యధేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఆ విషయాన్ని గుర్తించిన కనేకల్ ఎస్ఐ శేఖర్ ఆదివారం ఆరు ఇసుక లారీలు, ఓ జేసీబీని సీజ్ చేశారు. దీనిపై టీడీపీ నేతలు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయన రంగంలోకి దిగి... వాహనాలను వెంటనే విడిచి పెట్టాలని పోలీసులను ఆదేశించారు. దీంతో ఏం చేయాల్లో తెలియక పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. అయితే ఈ విషయం తెలిసిన వైఎస్ఆర్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.... కాల్వ శ్రీనివాసులపై మండిపడ్డారు. కాల్వ తీరును తప్పిపట్టారు. ప్రభుత్వ చీఫ్ వీప్ గా ఉన్న కాల్వ శ్రీనివాసులు ఇలాంటి చర్యలకు వత్తాసు పలకడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇసుక అక్రమ రవాణాతో టీడీపీ నేతలు కోట్ల రూపాయిలు దోచుకుంటున్నారని కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు.