కాంగ్రెస్ అధిష్టానం, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై రాష్ట ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కేంద్రంలోని పెద్దలు రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, ప్రజలతో ఆటలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణకు అనుకూలమని లేఖ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... ఇప్పుడు సీమాంధ్ర ప్రాంత నాయకులతో వేరే మాట చెప్పిస్తున్నారని దుయ్యబట్టారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ హైకమాండ్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్, తెలుగు ప్రజలతో ఆడుతున్న నాటకానికి నిరసనగా స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తున్నా. ఈ లేఖను లోక్‌సభ స్పీకర్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపుతున్నా. వ్యక్తిగతంగా రమ్మని స్పీకర్ నుంచి పిలుపు వస్తే అక్కడికి వెళ్లి నా రాజీనామాను ధ్రువీకరిస్తా..’’ అని చెప్పారు. ఢిల్లీ రాక్షస క్రీడకు రాష్ట్రాన్ని బలి చేశారని, ఇప్పుడు దేశాన్ని కూడా బలి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుని ఇప్పుడు దేశం మొత్తాన్ని అగ్నిగుండంగా మార్చారని ధ్వజమెత్తారు. ‘‘ఒకవేళ రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని మేం గతంలోనే చెప్పాం. ఇదా ఆమోదయోగ్యం అంటే? శ్రీకృష్ణ కమిటీని వేశారు. రూ.30 కోట్లు ఖర్చు పెట్టారు. కమిటీ సభ్యులందరూ రాష్ట్రమంతా పర్యటించి ఒక నివేదిక ఇచ్చారు. దాన్నేమైనా పాటించారా? ఈరోజు మళ్లీ దిగ్విజయ్‌సింగ్ ఒక కమిటీ వేస్తారట. అందులో ఆయన కూడా ఉంటాడట. ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తారట. ఏమిటీ మాటలు.. ఏమిటీ తీరు? రాష్ట్రంతో ఆటలాడి ఏదో రాజకీయంగా లబ్ధి పొందుదామని చూస్తే ఇప్పుడు దేశమంతా మంటలు చెలరేగుతున్నాయి. రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఈ రాక్షస క్రీడకు రాష్ట్రాన్ని బలిచేశారు. దేశాన్ని కూడా బలి చేయాలని చూస్తున్నారు’’ అని అన్నారు. చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరిపైనా మేకపాటి నిప్పులు చెరిగారు. ‘‘చంద్రబాబు తెలంగాణకు అనుకూలమని గతంలో లేఖ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు సీమాంధ్ర నాయకులతో ఒకమాట, తెలంగాణ నాయకులతో ఒకమాట చెప్పిస్తున్నారు. ఈరోజు ఆ పార్టీ సీమాంధ్ర నాయకులు లోక్‌సభలో గొడవ చేశారు. అలాంటప్పుడు నాడు తెలంగాణకు అనుకూలమని చంద్రబాబు ఎందుకు లేఖ ఇచ్చారు? ఇప్పుడు ఎందుకు ఈ నాటకాలు? చంద్రబాబు తెలంగాణలో ఒకమాట, సీమాంధ్రలో ఒకమాట మాట్లాడిస్తున్నారు. ఇలా రెండుచోట్ల ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు.’’ అని అన్నారు. రాజకీయాల్లో మాటకు కట్టుబడి ఉండాలే తప్ప వ్యూహాల మీద వ్యూహాలు పన్నుతూ ప్రజలతో ఆటలాడుకోవద్దని సూచించారు.
Published Tue, Aug 6 2013 7:53 AM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
Advertisement