ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం (ఈనెల 9న) జరగనున్న ఎంసెట్-2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ ఎన్‌వీ రమణరావు తెలిపారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని.. విద్యార్థులను 9 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. వర్షాకాలం అయినందున వీలైనంత ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్ష ప్రారంభ సమయం తరువాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష హాల్లోకి వచ్చాక పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు వెళ్లనీయరని పేర్కొన్నారు.