రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలతో దాదాపు అన్ని ప్రాజెక్టుల్లోకి నీళ్లు పుష్కలంగా చేరాయని, రాబోయే రెండు మూడేళ్ల వరకు నీటికి ఢోకా లేదంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. వర్షాలతో ప్రజలంతా ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. వరదల వల్ల జరిగిన ప్రాణనష్టం వందలోపే ఉందని, బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని తెలిపారు. రాష్ర్టంలో జరిగిన నష్టాలపై యుద్ధ ప్రాతిపదికన అంచనాలు తయారుచేసి కేంద్రానికి నివేదిక అందిస్తామన్నారు. దశాబ్ద కాలంగా పనుల్లో జరిగిన జాప్యం వల్లే మిడ్‌మానేరు రిజర్వాయర్ కట్టకు గండి పడిందని పేర్కొన్నారు. ఇందుకు కారణమైన కాంట్రాక్టర్‌ను తొలగించడంతోపాటు తాజా రేట్లతో కొత్తగా టెండర్లు నిర్వహించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.