మూడు వారాలు గడుస్తున్నా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఏం మార్పూ లేదు. విపక్షాల ఆందోళన, ప్రభుత్వం ఎదురుదాడి మధ్య శుక్రవారమై ఉభయ సభలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే వాయిదాపడ్డాయి. నోట్ల రద్దుపై చర్చకు సిద్ధమంటూ లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రకటించినా 16 రోజులుగా సభను అడ్డుకున్నందుకు క్షమాపణలు చెప్పాలంటూ ప్రభుత్వం డిమాండ్ చేయడంతో గందరగోళం కొనసాగింది. రాజ్యసభలో నోట్ల రద్దు అంశంతో పాటు గోధుమలపై దిగుమతి సుంకం తగ్గించడాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభను స్పీకర్ వాయిదా వేయగా, వాయిదాల అనంతరం సమావేశమైన రాజ్యసభలో కోరం లేకపోవడంతో డిప్యూటీ చైర్మన్ తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేశారు.