ఒకటి అగ్రదేశం. ప్రపంచ రాజకీయాలను, అంతర్జాతీయ సంబంధాలను కోరుకున్న రీతిలో ప్రభావితం చేయగల దేశం..అమెరికా. మరోటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అన్నింటా అంతర్జాతీయ శక్తిగా ఎదగగల సత్తా ఉందని ప్రపంచమంతా భావిస్తున్న దేశం.. భారత్! ఈ రెండు ప్రఖ్యాత ప్రజాస్వామ్య దేశాల శిఖరాగ్ర సమావేశం మంగళవారం వాషింగ్టన్‌లో జరిగింది. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు, అంతర్జాతీయ అంశాల్లో సహకారాత్మక సంబంధాలను దృఢపర్చుకునేందుకు.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆర్థిక రంగంలో సహకారం, వాణిజ్యం, పెట్టుబడులపై అవగాహనకు వచ్చారు. పశ్చిమాసియాలో పరిసితులతో పాటు ‘ఇస్లామిక్ స్టేట్’ ఉగ్రవాదాన్ని అంతమొందించే అంశం కూడా వారి మధ్య ప్రస్తావనకు వచ్చింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన చర్చల అనంతరం మోదీ, ఒబామాలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విషయంలో కృతనిశ్చయంతో ఉన్నామని వారు స్పష్టం చేశారు. ఇంధన భద్రత, రక్షణ, మౌలిక వసతులు.. తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నామని, ఆ ఒప్పందం అమలుకు అడ్డుపడుతున్న సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు ఒబామా తెలిపారు.