చంద్రబాబుతో పొత్తు అంటేనే జంకుతున్న పార్టీలు | Parties fear over tie-up with Chandrababu's TDP | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 2 2013 11:44 AM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాగూ గెలిచే అవకాశాల్లేవని తేలిపోవటంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో చేరిపోయి ఒక కీలకమైన మంత్రి పదవిని చేపట్టాలని ఆశిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? అధికారం చేపట్టటానికి ఏ పార్టీకి ఎక్కువ అవకాశాలున్నాయి? సర్వేలు ఏం చెప్తున్నాయి? వంటి అంశాలపై ఇటీవలి కాలంలో పలు దఫాలుగా అత్యంత సన్నిహితులతో చంద్రబాబు సమాలోచనలు జరిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో వాదనలు కొనసాగుతున్న తరుణంలో.. బెయిల్‌ను అడ్డుకునే లక్ష్యంతో వారం రోజుల కిందట ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు పనిలో పనిగా ఎన్నికల్లో పొత్తుల అంశంపైన కూడా దృష్టి సారించారు. ఆయా పార్టీల జాతీయ నాయకులను కలిశారు. వారెవరూ అడక్కపోయినా చంద్రబాబు జోక్యం చేసుకుని.. భవిష్యత్తులో తమ పార్టీ నుంచి వారికి అన్ని రకాలుగా మద్దతు ఉంటుందని అందరికీ చెప్పారు. కేంద్రంలో రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయన్న స్పష్టత లేనికారణంగా అందరికీ అన్ని రకాలుగా సహకరిస్తానని చంద్రబాబు ముందు జాగ్రత్త ప్రదర్శించారు. ఒకవైపు కాంగ్రెస్‌తో కుమ్మకై్క రాజకీయాలు నెరపుతున్న చంద్రబాబు.. రేపు రాబోయే పరిస్థితుల్లో ఎటువైపు కావాలనుకుంటే అటువైపు వెళ్లేలా గోడ మీది పిల్లి తరహాలో అన్ని అవకాశాలనూ బేరీజు వేస్తున్నారన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతున్నాయి. ఎవర్ని కలిసినా అనుమానంగా చూస్తున్నారు ఎన్నికలు వస్తున్నాయనగానే రాజకీయ పార్టీల మధ్య పొత్తులు, సీట్ల సర్దుబాటు వ్యవహారాలు తెరపైకి రావటం సహజమే. అయితే గత సాధారణ ఎన్నికలప్పుడు నాలుగు పార్టీలను కలిపి మహాకూటమిని ఏర్పాటు చేసిన చరిత్ర కలిగిన టీడీపీతో పొత్తంటేనే ఇప్పుడు మిగిలిన పార్టీలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నట్లు పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఆయా జాతీయ పార్టీలు ఆచితూచి స్పందిస్తున్నాయి. దీనికి గత మూడు నాలుగేళ్లుగా చంద్రబాబు వ్యవహరించిన తీరే ప్రధాన అవరోధంగా మారిందని ఆయా రాజకీయ పార్టీలు విశ్లేషిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా అన్ని విషయాల్లోనూ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చంద్రబాబు తెరవెనుక లాలూచీ వ్యవహారాలే ఇప్పుడు తమకు కష్టాలు తెచ్చిపెట్టాయని టీడీపీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. ఈ నెల 21వ తేదీన చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మూడు రోజుల పాటు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల జాతీయ నేతల ఇళ్లకు వెళ్లినప్పుడు ప్రతి నాయకుడు చంద్రబాబు పట్ల అనుమానపు చూపులు చూడటం టీడీపీ నేతలను నిరాశపరిచింది. తాము ఢిల్లీలో బీజేపీ, సీపీఎం, సీపీఐ ఇలా ఏ పార్టీ నేత ఇంటికి వెళ్లినా గతంలో లభించిన స్వాగతం లభించలేదని, అందరూ ముభావంగానే మాట్లాడారని ఆ చర్చల్లో పాల్గొన్న నేత ఒకరు చెప్పారు. చంద్రబాబు పట్ల ఆయా జాతీయ పార్టీలకు పూర్తి అవగాహన ఉందని, కాంగ్రెస్‌తో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్న వైనం కారణంగానే ఇప్పుడు చంద్రబాబు అంటేనే అనుమానపు చూపులు చూస్తున్నారన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. బాబుతో భేటీకి రాజ్‌నాథ్‌ విముఖత… బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను చంద్రబాబు కలవటానికి టీడీపీ రాజ్యసభ సభ్యుడొకరు తీవ్రస్థాయిలో ప్రయత్నించినప్పటికీ తొలుత ఆయన విముఖత ప్రదర్శించారు. దాంతో చంద్రబాబు వెంటనే తన రాజగురువు రామోజీరావును ఆశ్రయించారు. ఆయన తన గుజరాతీ టీవీ చానల్‌ ముఖ్యుడి సహకారంతో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని సంప్రదించి పరిస్థితిని వివరించి ఎలాగైనా చంద్రబాబు కలిసేందుకు రాజ్‌నాథ్‌సింగ్‌ను ఒప్పించాల్సిందిగా కోరారు. మోడీ ద్వారా చంద్రబాబు తన అపాయింట్‌మెంట్‌ కోరటంతో రాజ్‌నాథ్‌ కాదనలేకపోయారు. రాజ్‌నాథ్‌తో అపాయింట్‌మెంట్‌ పంచాయితీ తనవద్దకు రాగానే మోడీ కూడా మొదట్లో చంద్రబాబు వైఖరిని తప్పుపట్టినట్లు సమాచారం. గోధ్రా అల్లర్లలో తన ప్రమేయం, పాత్ర లేదని చెప్పినప్పటికీ అపుడు తమకు మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు.. గోవాలో బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగినపుడు రాజీనామాకు డిమాండ్‌ చేశారనే విషయాన్ని మోడీ గుర్తు చేసినట్లు సమాచారం. ఎన్‌డీఏలో చేరతానన్న బాబుపై అసహనం మోడీ ద్వారా తనను కలిసి చంద్రబాబు చేసిన ప్రతిపాదనలపై రాజ్‌నాథ్‌ కూడా అసహనం ప్రదర్శించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఎన్‌డీఏలోకి రావటానికి చంద్రబాబు తన ఆసక్తిని వ్యక్తపరచగా రాజ్‌నాథ్‌ పెద్దగా స్పందించలేదని సమాచారం. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తెలుసుకోకుండా నిర్ణయానికి రావటం సమంజసం కాదంటూ ఆయన సున్నితంగానే చంద్రబాబు ప్రతిపాదనను పక్కనపెట్టినట్లు చెప్తున్నారు. గత నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి చేదోడు వాదోడుగా పనిచేస్తున్న చంద్రబాబు.. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్‌ లభించిన నేపథ్యంలో ఒక్కసారిగా రూటు మార్చే ప్రయత్నాలు ప్రారంభించారని బీజేపీ నేతల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ టీడీపీ అధినేతను ఉద్దేశించి గతంలో ఎన్‌డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీ అలాగే కొనసాగి ఉంటే ప్రస్తుతం బాబును ఎన్‌డీఏ కన్వీనర్‌ను చేసేవారమని, ఎప్పటి నుంచో ఎన్‌డీఏలో తమకు మిత్రులుగా కొనసాగుతున్న శిరోమణి అకాలీదళ్‌, శివసేన వంటి పార్టీల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రాలేమని కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. సూటిగానే ప్రశ్నించిన లెఫ్ట్ నేతలు... సీపీఎం, సీపీఐ, జనతాదళ్‌ (యు) నేతలను చంద్రబాబు కలిసినపుడు కూడా వారి నుంచి సరైన స్పందన లభించలేదని సమాచారం. జాతీయస్థాయిలో కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా తృతీయ ఫ్రంట్‌ ఏర్పాటు చేయటంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుందని, ఢిల్లీలో మళ్లీ చక్రం తిప్పుతామని తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర చేసినప్పుడు చెప్పిన చంద్రబాబు.. మళ్లీ అకస్మాత్తుగా బీజేపీ వైపు చూస్తుండటంతో వామపక్షాల నేతల్లోనూ అనుమానాలు తలెత్తాయి. ‘మీరు బీజేపీతో స్నేహాన్ని కోరుకుంటున్నారని చెబుతున్నారు.. దానికేమంటారు?’ అని వామపక్ష పార్టీ సీనియర్‌ నేత ఒకరు చంద్రబాబును సూటిగానే ప్రశ్నించినట్లు తెలిసింది. దాంతో ఏం చెప్పాలో తెలియక తన పార్టీ నేతల నుంచి డిమాండ్‌ ఉందంటూ చంద్రబాబు దాటవేసే ప్రయత్నం చేశారు. ‘‘ఎన్నికల్లో పొత్తులు, అవగాహనలపై ఏ రాజకీయ పార్టీ తమ ముందుకు ప్రతిపాదనలు తెచ్చినా రాష్ట్ర కమిటీలో చర్చించి జాతీయస్థాయిలో చర్చకు పంపిస్తాం.. ఆ నివేదిక ఆధారంగానే చర్చించి ఆ తర్వాతే నిర్ణయం జరుగుతుంది’’ అని వామపక్ష పార్టీకి చెందిన రాష్ట్ర నాయకుడొకరు చెప్పారు. చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో ఎలాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ రాష్ట్ర పార్టీలు అందించే నివేదికల ఆధారంగానే చర్చించి పొత్తులు ఖరారవుతాయని ఆయా పార్టీల నేతలు చెప్తున్నారు. ఎంపీకి పోటీ చేస్తే ప్రభుత్వంలో చేరొచ్చు... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఓటమి పాలైతే రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన పెంచుకున్న చంద్రబాబు.. లోక్‌సభకు పోటీ చేస్తే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో చేరొచ్చని భావిస్తున్నారు. ఒకదశలో తృతీయ ఫ్రంట్‌ కోసం మరోసారి ప్రయత్నాలు ప్రారంభించి ఆ తర్వాత జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషించాలని ఆశించారు. అయితే బీజేపీ మోడీ ప్రభంజనం వీస్తోందన్న వార్తలతో చంద్రబాబు కలవరపడ్డారు. దాంతో తృతీయ ఫ్రంట్‌ను పక్కనపెట్టి ఇప్పుడు బీజేపీ నేతలతో సఖ్యతకు తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెప్తున్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ, ఎన్‌డీఏ, వామపక్షాల నేతృత్వంలోని తృతీయ ఫ్రంట్‌.. ఈ మూడు కోణాల్లో ఏది లాభమన్న అంశంపై ఇప్పుడు టీడీపీలో లోతుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ముందు బాబుకో సీటు కావాలి కదా..! ‘‘ఎన్నికలు వస్తున్నాయంటే ఎవరి విశ్లేషణలు వారికుంటాయి. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి బాగా లేనందున కేంద్రానికి వెళ్లాలని ఆలోచన చేస్తున్న మాట వాస్తవం. అయితే పొత్తులు, సమీకరణలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. మాకు చెప్పుకోదగిన సీట్లు వచ్చినప్పుడు కదా జాతీయ స్థాయిలో మా పార్టీకి గుర్తింపు లభించేది. ముందు చంద్రబాబుకు అత్యంత భద్రమైన సీటొకటి చూడాలి. అదే లేనప్పుడు కేంద్రంలో హోంశాఖ తీసుకుంటామని ఇప్పటి నుంచే చెప్పుకోవటం మంచిది కాదేమో’’ అని చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన పార్టీ సీనియర్‌ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ‘‘చంద్రబాబును నమ్మటానికే ఇప్పుడు కొన్ని పార్టీలు వెనకాముందు ఆలోచిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయముంది.. చూడాలి ఏం జరుగుతుందో’’ అని నిర్వేదం వ్యక్తంచేశారు. నాలుగేళ్లుగా బాబు ట్రాక్‌ బాలేదు..! గడచిన నాలుగేళ్ల చంద్రబాబు ట్రాక్‌ రికార్డు కారణంగా ఇప్పుడు గతకాలపు మిత్రపక్షాలు పొత్తులపై ఆచితూచి స్పందిస్తున్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ మంచి పాలన అందించటంలో విఫలమైతే అది ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీ అయిన టీడీపీకి కలిసిరావాలి. కానీ ఈ నాలుగేళ్లలో అలాంటేదేమీ జరక్కపోగా టీడీపీ గ్రాఫ్‌ మరింత దిగజారింది. 2009 సాధారణ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో దాదాపు 40కి పైగా అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే ఒక్క చోటా టీడీపీ విజయం సాధించలేదు. పెపైచ్చు 2009లో పార్టీ తరఫున గెలిచిన దాదాపు 15 మందికి పైగా ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌తో మ్యాచ్‌ ఫిక్స్ చేసుకున్న చంద్రబాబును నమ్మలేక ఆ పార్టీని వీడిపోయారు. ప్రజా సమస్యలపై కేంద్రంతో మాట్లాడే సాకుతో ఢిల్లీ వెళ్లడం, ప్రభుత్వ పెద్దలతో ఏకాంతంగా భేటీ అవడం బాబుకు పరిపాటిగా మారింది. గత ఏడాది టీడీపీ నేతలతో పాటుగా ప్రధానిని కలిసిన చంద్రబాబు, వారందరినీ కనుసైగతో బయటికి పంపి తాను ఏకాంతంగా ముచ్చటించారు. అంతకు ముందు జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడానికి ఒకరోజు ముందు చంద్రబాబు ఢిల్లీలో భద్రతా సిబ్బందిని పక్కకు పెట్టి పార్టీ ఎంపీ సమకూర్చిన ఒక కారులో అత్యంత గోప్యంగా అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరంతో చీకట్లో అర్ధరాత్రి పూట భేటీ అయ్యారు. చాలాకాలం తర్వాత స్వయంగా చిదంబరమే ఈ రహస్యాన్ని లోక్‌సభ సాక్షిగా చెప్పారు కూడా. తనలో 30 శాతం కాంగ్రెస్‌ రక్తం ఉందని అసెంబ్లీలో బాహాటంగా చెప్పుకున్న చంద్రబాబు సిద్ధాంత ప్రాతిపదికన రాజకీయాలు చేయరని అనేక సందర్భాల్లో వెల్లడైనందున ఇప్పుడు జాతీయస్థాయి పార్టీలన్నీ ఆయనపట్ల అంతగా ఆసక్తిని కనబరచటం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్‌ బంధం వల్లే నమ్మట్లేదు క్షేత్రస్థాయిలో జరిగే పరిణామాలు జాతీయస్థాయి పార్టీ నేతలకు తెలియవని అనుకోవటం పొరపాటని, ఆయా పార్టీలకు చెందిన రాష్ట్ర నాయకులు ఇలాంటి విషయాలన్నీ ఎప్పటికప్పుడు వారికి నివేదించడం వల్ల చంద్రబాబుకు ఈ పరిస్థితి వచ్చిందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు చెప్పారు. ‘‘పైకి ఎంత మాట్లాడినా అనేక సందర్భాల్లో కాంగ్రెస్‌కు సహకరిస్తూనే వచ్చాం. ఎమ్మెల్సీ ఎన్నికలో, ఉపఎన్నికలో అనుకుంటే వేరు. ప్రభుత్వాన్ని పడగొట్టే మంచి అవకాశం వచ్చినా, అవిశ్వాస తీర్మానం పెట్టలేకపోయాం. పోనీ వేరే పార్టీ వాళ్లు పెట్టినప్పుడైనా మద్దతునిచ్చామా అంటే అదీ లేదు. పెపైచ్చు కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోకుండా కాపాడాం. ఎఫ్‌డీఐల విషయంలో రాజ్యసభలో చేసింది కూడా అదే. ఇంత చేశాక జాతీయ పార్టీలు మమ్మల్ని గుడ్డిగా నమ్మమంటే ఎలా నమ్ముతాయి?’’ అని ఆ నాయకుడు అన్నారు. రెండు లాభాలను ఆశించిన బాబు తనపై ఎక్కడ కేసులు, విచారణలు, దర్యాప్తులు వచ్చిపడతాయోనన్న భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు కాంగ్రెస్‌కు సహకరిస్తున్నారన్న అభిప్రాయం పార్టీ నేతలు కొందరిలో నెలకొంది. హస్తానికి చేయూతనందించినందుకు చంద్రబాబు కాంగ్రెస్‌ ఢిల్లీ పెద్దల నుంచి రెండు రకాల ప్రయోజనాలను ఆశించినట్లు చెప్తున్నారు. ‘ఒకటేమో.. తనపై ఎలాంటి విచారణలు రాకుండా చూసుకోవడం. రెండోది... రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన జగన్‌ను దెబ్బతీయటం. అందుకు కాంగ్రెస్‌ సహకారం ఎంతైనా అవసరం. అందుకే.. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కావటానికి ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించాలన్న డిమాండ్‌ చాలా గట్టిగా వినిపించినపుడు.. స్వయంగా టీడీపీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడి ద్వారా సోనియా రాజకీయ కార్యదర్శికి రాయబారం పంపించారు. ప్రభుత్వం పడిపోతుందని ఆందోళన పడాల్సిందేమీ లేదని, మేం అవిశ్వాస తీర్మానం పెట్టబోమని, పీఆర్పీ మీ పార్టీలో విలీనం కాకున్నా మీరేం వర్రీ కావద్దన్న సందేశాన్ని పంపించారు. చంద్రబాబు ఇలాంటి సందేశం పంపడమేంటని కాంగ్రెస్‌ కీలక నేత మొదట కొంత ఆశ్చర్యపోగా నమ్మకం కలిగించడానికి నేరుగా చంద్రబాబుతో ఆయనను ఫోన్లో మాట్లాడించారు. దాంతో బాబు పట్ల ఆ కాంగ్రెస్‌ కీలక నేతకు నమ్మకం పెరిగింది. ఆ అనుబంధం రానురాను మరింతగా బలపడటంతో ఇక తనపై ఎలాంటి కేసులు, విచారణలు, దర్యాప్తులు రావన్న భరోసా చంద్రబాబులో కలిగింది’ అని పార్టీ నాయకుడొకరు వివరించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement