ఎట్టకేలకు హైదరాబాద్ పాతబస్తీలో వారం క్రితం కిడ్నాపైన రెండేళ్ళ బాలుడు ఆకాష్ ఆచూకీ లభ్యమైంది. పశ్చిమ బెంగాల్లో కిడ్నాపర్ బారి నుంచి బాలుడిని క్షేమంగా పోలీసులు కాపాడారు. కిడ్నాపర్ రాంప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆకాష్ తండ్రి గోపాల్ వద్ద కిడ్నాపర్ రాంప్రసాద్ పని చేసేవాడు. బాలుడిని క్షేమంగా వదిలి పెట్టాలంటే మూడు కేజీల బంగారం కావాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆకాశ్ తండ్రి గోపాల్ ఫిర్యాదు మేరకు చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి ఆచూకీ కనుగొనేందుకు ఓ ప్రత్యేక బృందం కోల్కతా వెళ్లింది. ఫోన్ కాల్ ఆధారంగా కిడ్నాపర్ను పట్టుకున్నారు. ఆకాష్ క్షేమ సమాచారాలు తెలుసుకున్న తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.