ఆంధ్రప్రదేశ్ పోలీసులను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీవ్రంగా మందలించింది. రాష్ట్ర రాజధానిపై వరుస కథనాలు ప్రచురించిన సాక్షి జర్నలిస్టులను వేధించడం సరికాదని తెలిపింది. వార్తలకు ఆధారాలు చూపించాలంటూ జర్నలిస్టులకు నోటీసులు ఇచ్చి, వారిని పోలీసు స్టేషన్లకు రప్పించే ప్రయత్నాలు చేయడాన్ని ప్రెస్ కౌన్సిల్ తప్పుబట్టింది. అలాగే ఆ నోటీసులలో పోలీసులు ఉపయోగించిన రాజకీయ భాష కూడా అభ్యంతరకరంగా ఉందని ప్రెస్ కౌన్సిల్ తెలిపింది. ఆ నోటీసులపై సంబంధిత అధికారి, బాధ్యుడైన జిల్లా పోలీసు అధికారితో పాటు డీజీపీ కూడా స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ప్రెస్ కౌన్సిల్ ఆదేశించింది. సాక్షి జర్నలిస్టుల మీద వేధింపుల విషయమై ఏపీ జర్నలిస్టుల సంఘం, ఐజేయూ పిటిషన్లు దాఖలు చేశాయి.