మద్యం తాగి ఉన్న స్థితిలో.. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నడుపుతున్న వాహనంలో ప్రయాణిస్తున్నారా..? అయితే మీపైన కూడా ఇకపై కేసు తప్పదు. ప్రస్తుతం ఎదుటి వారి మరణానికి కారణమైన కేసులకు మాత్రమే ఈ నియమాన్ని వర్తింపజేయాలని నిర్ణయించిన రాచకొండ పోలీసులు.. భవిష్యత్తులో మిగిలిన కేసులకూ అమలు చేయాలని యోచిస్తున్నారు. మద్యం తాగిన స్థితిలో, మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్లు చేసిన ప్రమాదాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ మహేష్ ఎం. భగవత్ నిర్ణయించారు. వీరిపై భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 304 పార్ట్ 2 సెక్షన్ కింద కేసు నమోదు చేయనున్నామని ఆయన వెల్లడించారు.