నగరంలోని రాజేంద్ర నగర్లో ఓ వివాహిత మహిళను దుండగులు కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఉప్పరపల్లి కాలనీలో మహేష్, రాధిక దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం అయింది. అనిత అనే ఆరేళ్ల కుమార్తె ఉంది. మహేష్ కోఠిలోని ఒక ఎలక్ట్రానిక్ దుకాణంలో పని చేస్తుంటాడు. కాగా, రాధిక గత సోమవారం ఇంట్లో గుడికి వెళ్లి వస్తానని చెప్పింది. సాయంత్రం ఇంటికి వచ్చిన మహేష్‌కు భార్య ఆచూకీ లేకపోవడంతో చుట్టుపక్కల వారిని సమాచారం అడిగాడు. అయినా ఆమె ఆచూకీ లభించక పోవడంతో భార్యకు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. తిరిగి రాత్రి 9 గంటలకు భార్య నంబరు నుంచి మహేష్ కు ఫోన్ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి రాధికను కిడ్నాప్ చేశానని రూ. 3 లక్షలు ఇస్తేనే వదిలేస్తానని డిమాండ్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన మహేష్ వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు ఆశ్రయించాడు. అయితే పోలీసులు సరిగా స్పందించలేదు. తాను అంత డబ్బు ఇవ్వలేనని, రూ. 50 వేలు మాత్రమే ఇవ్వగలనని మహేష్ నిందితుడితో చెప్పాడు. దీంతో నిందితుడు గురువారం రూ. 50 వేలు తీసుకొని, మోహంజాయి మార్కెట్ వద్దకు రావాలని చెప్పాడు. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పి ఓ కానిస్టేబుల్ సహాయంతో మెహంజాయి మార్కెట్ దగ్గరకి వెళ్లిన మహేష్‌ను నిందితుడు కోఠి రావాలని చెప్పాడు. అక్కడికి వెళ్లిన మహేష్‌ను నిందితుడు కలవలేదు. చివరకి వాట్సప్ ద్వారా యాకత్‌పురా ఎస్బీఐ బ్యాంకు ఖాతా నంబరు ఇచ్చి డబ్బులు అకౌంట్‌లో జమ చేయాలని నిందితుడు డిమాండ్ చేశాడు. దీంతో మహేష్ బ్యాంక్ అకౌంట్ నంబరు ఆధారంగా నిందితుడు మహ్మద్ అజార్‌ఖాన్ గా గుర్తించాడు. కాగా, నిందితుడు తిరిగి శుక్రవారం రాధిక చేయి, గొంతు కోసినట్లున్న రెండు ఫోటోలను వాట్సప్ ద్వారా మహేష్ కు పంపాడు. రాధిక ముంబైలో ఉందని, రూ. 3లక్షలు ఇవ్వకుంటే ముంబై రెడ్లైట్ ఏరియాలో అమ్మేస్తామని హెచ్చరించారు. కాగా దుండగలు తనకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి కొడుతున్నారని బాధితురాలు ఫోన్ ద్వారా భర్తకు తెలిపింది. దీంతో మహేష్ నిందితుడు పంపిన ఆధారాలను శుక్రవారం పోలీసులకు తెలిపాడు.
Published Sat, Jul 11 2015 10:40 AM | Last Updated on Fri, Mar 22 2024 10:56 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement