అధికార తెలుగుదేశం పార్టీ మరోసారి ప్రలోభాలకు తెరలేపింది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక శుక్రవారం విజయవాడలో సీఎం చంద్రబాబుతో సమావేశమైనట్టు తెలుస్తోంది. చంద్రబాబు అమెరికా పర్యటన తర్వాత రేణుక పార్టీ మారేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. వచ్చే నెల 2వ తేదీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో.. పాదయాత్రకు జనం నుంచి వచ్చే స్పందనను పక్కదోవ పట్టించేందుకు అధికార పార్టీ ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటుతో పాటు ఎన్నికలకు అయ్యే మొత్తం వ్యయాన్ని కూడా భరిస్తామని బుట్టా రేణుకకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే తక్షణ ప్రయోజనంగా రూ.70 కోట్ల భారీ ప్యాకేజీతో పాటు పలు కాంట్రాక్టులు కూడా కట్టబెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది.