ఓటుకు కోట్ల కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన కుమార్తె నిశ్చితార్థానికి హాజరై.. తిరిగి చర్లపల్లి జైలుకు చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఆయనకు తాత్కాలిక బెయిల్ సమయం ఉన్నా, చర్లపల్లి జైలు నగరానికి దూరంగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా ముందుగానే ఆయన బయల్దేరినట్లు తెలుస్తోంది. అత్యంత పటిష్ఠమైన నిఘా మధ్య రేవంత్ రెడ్డిని జైలుకు తరలించారు. ఉదయం 8.45 గంటలకు తన ఇంటి నుంచి ఎన్ కన్వెన్షన్కు చేరుకున్న రేవంత్రెడ్డి, అక్కడి నుంచి తిరిగి 2.30 గంటలకు ఇంటికి చేరుకున్నారు. గంటన్నర పాటు కుటుంబ సభ్యులతోను మరికొందరు నాయకులతోను గడిపారు. మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్రెడ్డి, మరికొందరు నాయకులు ఆయనను కలిసినవారిలో ఉన్నారు. సరిగ్గా సాయంత్రం 4 గంటలకు ఆయనే స్వచ్ఛందంగా బయటకు వచ్చి, తనను తరలించేందుకు సిద్ధంగా ఉన్న వాహనంలోకి ఎక్కారు. వెంటనే ఎస్కార్ట్ సిబ్బంది ఆయనతో పాటు జైలుకు బయల్దేరారు. రెండు గంటల సమయం ఉన్నప్పటికీ, సాయంత్రం 6 గంటల్లోగానే జైలుకు తిరిగి వెళ్లాలన్న నిబంధన ఉండటంతో ఆయన ముందే బయల్దేరినట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటలకే ఆయన చర్లపల్లి జైలుకు చేరుకున్నారు. చాలామంది ఆయనను కలిసేందుకు జైలు వద్దకు వచ్చినా, ఆయన మాత్రం ముందుగానే సాయంత్రం 5 గంటలకే జైలు లోపలకు వెళ్లిపోయారు.
Published Thu, Jun 11 2015 6:06 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
Advertisement