ఒకడిది నల్లటి సఫారీ డ్రెస్.. చేతిలో పిస్టోల్.. ఇంకొకడిది ట్రాఫిక్ పోలీస్ వేషధారణ.. మరొకడి ముఖానికి మంకీ క్యాప్.. ఇలా ఐదుగురు ఐదు రకాలుగా వచ్చారు.. తామంతా సీబీఐ అధికారుల మన్నారు.. అచ్చూ పోలీసుల మాదిరే మాట్లా డారు.. నల్లడబ్బుతో కొందరు బంగారం కొని ఇక్కడే దాచారని దబాయించారు.. ఇదిగో వీడే దొంగ అంటూ ‘మంకీ క్యాప్’వేసుకున్నవాడిని చూపించారు.. లాకర్లు తెరవమన్నారు.. ‘నో’అన్నందుకు తుపాకీతో బెదిరించారు.. గదిలో బంధించారు.. 15 నిమిషాల్లోనే రూ.13 కోట్ల విలువైన 46 కిలోల బంగారంతో ఉడాయించారు! సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని బీరంగూడ కమాన్ సమీపంలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్‌లో జరిగిన ఘరానా దోపిడీ ఇది!! నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే 65వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న ఈ సంస్థలో బుధవారం ఉదయం సినీఫక్కీలో చోటుచేసుకున్న ఈ భారీ దొంగతనం సంచలనం సృష్టించింది.