టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడంకాదు, చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకుని నిలదీయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా సలహా ఇచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రుల బృందానికి లేఖలు ఎందుకు ఇవ్వడంలేదని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు, కిరణ్‌లకు వారి సొంత జిల్లా ప్రజల కష్టాలు కూడా తెలియడంలేదా? ఆమె ప్రశ్నించారు. వీరిద్దరూ గాంధీగారి మూడు కోతుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలుగు వారికి వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు అన్న అయితే కిరణ్ తమ్ముడిలా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఆడమన్నట్లు ఆడుతున్నారన్నారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సోనియా గాంధీ ఆదేశాల కోసం ఎదురు చూస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్, టీడీపీ సమైక్య నినాదంతో ప్రజల ముందుకు రావాలని రోజా పిలుపు ఇచ్చారు.