ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీలో భారీ కుంభకోణం చోటు చేసుకుంటోంది. ఏకంగా 800 కోట్ల రూపాయలు యాజమాన్యాల జేబుల్లోకి వెళుతున్నాయి. ఇప్పటికే ఎన్నారై కోటాలోని 15 శాతం (300) సీట్లను రూ.కోటీ 25 లక్షల చొప్పున అమ్మేసుకున్న యాజమాన్యాలు.. ఇప్పుడు యాజమాన్య కోటాలోని 735 (35శాతం) సీట్లనూ దాదాపుగా అమ్మేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా అమ్ముకున్న సీట్లలో ఆయా అభ్యర్థులకే ప్రవేశాలు కల్పించుకొనేందుకు ప్రత్యేక ప్రవేశపరీక్ష పేరిట వ్యవహారాన్ని తెరపైకి తెచ్చాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వైద్య మంత్రికే తెలియకుండా ‘ప్రైవేటు’ పరీక్ష నోటిఫికేషన్ రావడం, అదీ గుట్టుచప్పుడు కాకుండా చేయడం, ఇన్ని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం వంటివన్నీ ఇది భారీ కుంభకోణమని స్పష్టం చేస్తున్నాయని ప్రభుత్వాధికారులే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.