ప్రత్యేక తెలంగాణ నిర్ణయం నేపథ్యంలో సీమాంద్ర ప్రాంతానికి చెందిన ఆరుగురు ఎంపీలు తమ పదవులకు శుక్రవారం రాజీనామా చేశారు. వారు తమ రాజీనామా లేఖలను పార్లమెంట్ హాలులో లోక్సభ, రాజ్యసభ సెక్రటరీ జనరల్లకు సమర్పించారు. రాజీనామాలు చేసినవారిలో ఎంపీలు అనంత వెంకటరామిరెడ్డి, సాయిప్రతాప్, హర్షకుమార్, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, రాజ్యసభ్య సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కూడా ఉన్నారు. మరోవైపు ఎంపీలు సబ్బం హరి, ఎస్పీవై రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, రాయపాటి సాంబశివరావు తన రాజీనామా లేఖలను ఫ్యాక్స్ ద్వారా పంపారు. కాగా ఎంపీల సమావేశానికి కేంద్రమంత్రులు చిరంజీవి, కిషోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మి హాజరు కాలేదు. రాజీనామాలు అవసరం లేదని మంత్రులు కిషోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఎంపీలు రాయపాటి సాంబశివరావు, ఎస్పీవై రెడ్డిలు తాము రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. రాజీనామాలు చేయకుండా నియోజకవర్గాలకు వెళ్లే పరిస్థితులు లేవని, వెళ్లినా ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోక తప్పదని నేపథ్యంలో ఎంపీలు రాజీనామాలు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో కొందరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం, ముగ్గురు మంత్రులు కూడా రాజీనామాల బాట పట్టడంతో ఒత్తిడి పెరగటంతో వారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాజీనామాలు చేసిన ఎంపీలు మరికాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు.
Published Fri, Aug 2 2013 1:48 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement