ఆషాడ జాతరగా పేరొందిన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ప్రారంభమయింది. తెల్లవారుజామున 4 గంటలకు మహా హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిచ్చారు. తెలంగాణాతో పాటు వివిధ జిల్లాలకు చెందిన లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ బోనాల జాతర జరగనుంది. ఆదివారం భక్తులు అమ్మవారికి బోనాలు, సాక సమర్పిస్తారు. సోమవారం రంగం కార్యక్రమంలో అవివాహిత మహిళ భవిష్యవాణి వినిపిస్తుంది. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల్ని ప్రతిబింబించే ఈ జాతరలో పాల్గొనే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ, దేవదాయ, పోలీసు, జలమండలి, విద్యుత్, ఆర్టీసీ, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరతో పాటు సికింద్రాబాద్‌లోని 40 దేవాలయాల్లో ఆదివారం బోనాల ఉత్సవాలు జరుతున్నాయి. దీంతో సికింద్రాబాద్‌కు మొత్తం బోనాల కళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మరోవైపు జాతరకు తరలి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 30 ప్రత్యేక బస్సులు నడుపుతోంది.