తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), అల్లోల. ఇంద్రకరణ్ రెడ్డి (ఆదిలాబాద్), తలసాని శ్రీనివాస్ యాదవ్ (హైదరాబాద్ ), సి.లక్ష్మారెడ్డి (మహబూబ్ నగర్), అజ్మీరా చందూలాల్ (వరంగల్ ), జూపల్లి కృష్ణారావు (మహబూబ్ నగర్) మంత్రులుగా ప్రమాణం చేశారు. తెలంగాణలోని శాసన సభ్యుల సంఖ్య ప్రకారం మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి 18 మందికి చేరింది. ఇప్పటికే సీఎంతో కలిపి 12 మంది ఉన్నారు. తాజాగా ఆరుగురికి అవకాశం కల్పించటంతో పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రాజ్‌భవన్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మంత్రివర్గంలో చోటు లభించని వారి అనుచరులు రాజ్‌భవన్ వద్ద నిరసనలు తెలిపే అవకాశం ఉండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని పోలీస్ విభాగాలకు చెందిన బలగాలను రంగంలోకి దించారు. ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో రాజకీయ ప్రముఖులు, అధికారులను, పాస్‌లు కలిగి ఉన్న వారినే అనుమతించారు.
Published Tue, Dec 16 2014 11:23 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement