c. laxma reddy
-
దేశానికి పట్టిన శని.. కాంగ్రెస్
సాక్షి, జడ్చర్ల : దేశంతో పాటు రాష్ట్రానికి పట్టిన శని అని... ఆ పార్టీ తరిమికొట్టడం ద్వారా తమిళనాడు, కేరళ, తదితర రాష్ట్రాలు బాగుపడిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కూడా అదే తరహాలో ముందుకు సాగి టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. జడ్చర్ల మండలంలోని పల్గుగడ్డ తండాలో శుక్రవారం ఆయన టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అరవై ఏళ్ల పాటు కాంగ్రెస్, టీడీపీలు రాష్టాన్ని పాలించగా ప్రజలు దగా పడ్డారని.. కేవలం నాలుగేళ్ల కాలంలో తాము అనేక అభివృద్ధి కార్యఖ్రమాలు చేపట్టామని తెలిపారు. ఇక్కడ చేపడుతున్న పథకాలతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని పేర్కొన్నారు. నాటి శ్రీరాముడి పాలన మాదిరిగా రాష్ట్రంలో పాలన సాగుతోందని వెల్లడించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, వైస్ ఎంపీపీ రాములు, ఎంపీటీసీ సభ్యురాలు మణెమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడ్గల్ యాదయ్య, కోఆప్షన్ సభ్యుడు ఇమ్ము, మార్కెట్ డైరెక్టర్ గోవర్దన్‌రెడ్డితో పాటు కొంగళి జంగయ్య, తావుర్యానాయక్, శ్రీకాంత్, ప్రణీల్ పాల్గొన్నారు. జాతీయ రహదారి పనుల్లో నాణ్యత పాటించాలి జడ్చర్ల–కోదాడ జాతీయరహదారి విస్తరణ పనుల్లో నాణ్యత పాటించాలని మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ఆదేశించారు. జడ్చర్ల – మిడ్జిల్ మద్యలో జరుగుతున్న పనులను శనివారం ఆయన పరిశీలించి పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలపై కాంట్రాక్టర్, ఉద్యోగులతో చర్చించారు. రాకపోకలకు అంతరాయం కలుగకుండా, ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా పనులు చేపడుతూ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రహదారి విస్తరణ పనులు పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ఆయన వెంట మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యురాలు హైమావతి, తదితరులు ఉన్నారు. -
చేతకానిది కాదు.. చేవ ఉన్న చేతల ప్రభుత్వం'
మహబూబ్ నగర్: తెలంగాణ ప్రభుత్వం చేతకానిది కాదని.. చేవ ఉన్న చేతల ప్రభుత్వం' అని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మహబూబ్ నగర్ లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు తెలంగాణ ప్రభుత్వ పథకాలు కనిపించడం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం పాలన అంటే పాఠాలు చెప్పడం కాదని మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. -
నాలుగు జిల్లాల్లో ఆయుష్ ఆసుపత్రులు
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఆయుష్ ఆసుపత్రులను నెలకొల్పనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి తెలిపారు. సిద్ధంగా ఉన్న భవనాల్లో 20 పడకల ఆయుష్ ఆసుపత్రులను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం మంత్రి లక్ష్మారెడ్డి ఆయుష్ వైద్య విభాగంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయుష్ డిస్పెన్సరీలను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఆయుష్ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టాలని సూచించారు. ఎయిడ్స్‌పై పరిశోధనలను మరింత ముమ్మరం చేసి ఆ మహమ్మారిని పారదోలాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమీక్షలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ఆయుష్ కమిషనర్ డాక్టర్ రాజేందర్, డీఎంఈ రమణి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ వీణాకుమారి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ లలితకుమారి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాల్ పాల్గొన్నారు. -
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: మంత్రి లక్ష్మారెడ్డి
విజయవాడ: ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థులు స్పోర్ట్స్ కోసం అమలాపురం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. గొల్లపూడి సమీపంలోని సురయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి స్పందించి గొల్లపూడిలోని ఆంధ్రా ఆస్పత్రికి ఆయన వెళ్లారు. క్షతగాత్రులను పరామర్శించారు. విద్యార్థులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చెట్టుకు ఢీకొని ఈ ఘటన జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఆరుగురు విద్యార్థులు ఐసీయూలో ఉన్నారని, మరో ఇద్దరు విద్యార్థులకు సర్జరీలు జరిగాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికీ ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని, చనిపోయిన విద్యార్థులను ఆదుకోవడానకి సీఎం కేసీఆర్ తో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. స్పోర్ట్స్ ఈవెంట్ సజావుగానే సాగిందని, చివర్లో ట్రావెల్స్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. వైద్యులు అనుమతి విద్యార్థులను హైదరాబాద్ కు తీసుకొచ్చి చికిత్స అందించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. -
దేశానికే ఆదర్శంగా పారిశ్రామిక విధానం
పారిశ్రామికవేత్తలూ మాకు ముఖ్యమే: జూపల్లి పరిశ్రమలకు ఏడాదిలో విద్యుత్ కష్టాలు దూరం: లకా్ష్మరెడ్డి సాక్షి, హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లకు రాయితీలతో పాటు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కొత్త రాష్ర్ట అభివృద్ధిలో రైతులతో పాటు పారిశ్రామికవేత్తలూ ముఖ్యమేనని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానం దేశానికే ఆదర్శంగా నిలువబోతోందని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్(టాప్సీ), తెలంగాణ పారిశ్రామిక వేత్తల ఫెడరేషన్(టిఫ్)ల సంయుక్త ఆధ్వర్యం లో బుధవారం తెలంగాణలో ఆర్థిక, పారిశ్రామిక, సాంస్కృతిక అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సుమారు 60 వేల ఎంఎస్ఎంఈల ద్వారా రాష్ట్రం నుంచి 42 శాతం ఎగుమతులు జరుగుతూ, లక్షలాది మందికి ఉపాధి లభించడం గొప్ప విషయమన్నారు. చిన్న పారిశ్రామికవేత్తలు పెద్ద పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు రావాలని సూచించారు. పరిశ్రమలకు నీటి సమస్య లేకుండా చూస్తామని, వాటర్‌గ్రిడ్ ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పారు. మూతపడిన పరిశ్రమలను తెరిపించడంతోపాటు, రాష్ర్టంలో ఏ పరిశ్రమకు ఆ పరిస్థితి రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఏడాదిలోపు విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలను, వ్యాపారులను ఇబ్బందికి గురిచేయకుండా పన్ను వసూలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రణాళికసంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు ఎస్. నిరంజన్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి(రెవెన్యూ) వి.శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ పారిశ్రామికవేత్తల ఫెడరేషన్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, ఫ్యాప్సీ అధ్యక్షుడు శివకుమార్ రుంగ్టా, టాప్సీ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, డిక్కీ అధ్యక్షుడు నరేందర్, కాస్మి అధ్యక్షుడు రాజమహేందర్ రెడ్డి, మహిళా పారిశ్రామికవేత్త సరితా రెడ్డి, నాగేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్ నుంచి మంత్రి వరకూ...
హైదరాబాద్ : మంత్రివర్గ విస్తరణలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే చెర్లకోల. లక్ష్మారెడ్డి రేసులో ముందు నిలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆయన మంగళవారం గవర్నర్ సమక్షంలో తెలంగాణ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా సమీకరణల్లో భాగంగా తొలివిడత మంత్రివర్గంలో సి.లక్ష్మారెడ్డికి స్థానం దక్కలేదు. సర్పంచ్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయనకు మంత్రి పదవి దక్కింది. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగడం, 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఓటమిపాలు కావడం ...అలాగే ఇటీవల ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందటం ఆయనకు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. కాగా కరువు జిల్లా పాలమూరుపై కేసీఆర్ పదవుల వర్షం కురిపించటంతో లక్ష్మారెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావుకు చోటు దక్కింది. వ్యక్తిగత వివరాలు: తల్లిదండ్రులు: లక్ష్మమ్మ, నారాయణరెడ్డి పుట్టిన తేదీ: 03-02-1962 భార్యః శ్వేత కూతురుః స్పూర్తి, కుమారుడు: స్వరణ్ స్వగ్రామం: అవంచ గ్రామం, తిమ్మాజిపేట మండలం, మహబూబ్‌నగర్ జిల్లా విద్యార్హత: బిహెచ్ఎంఎస్ రాజకీయ ప్రస్థానం : 1988: అవంచ గ్రామ సర్పంచ్‌గా ఎన్నిక 1995: తిమ్మాజిపేట సింగిల్‌విండో అధ్యక్షులుగా ఎన్నిక 1996: జిల్లా గ్రంథాలయ అభివృధ్ది సంస్థ చైర్మన్‌గా నియామకం 1999: స్వతంత్య్ర అభ్యర్థిగా జడ్చర్ల నుంచి శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు 2001: టిఆర్ఎస్లో చేరిక 2004-2008: జడ్చర్ల ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ నుంచి గెలుపొందారు 2008: ఎమ్మెల్యే పదవికి కెసిఆర్ పిలుపుతో రాజీనామా (రాజీనామా చేసిన మొదటి ఎమ్మెల్యే) 2014: తిరిగి టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
-
ఆరుగురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), అల్లోల. ఇంద్రకరణ్ రెడ్డి (ఆదిలాబాద్), తలసాని శ్రీనివాస్ యాదవ్ (హైదరాబాద్ ), సి.లక్ష్మారెడ్డి (మహబూబ్ నగర్), అజ్మీరా చందూలాల్ (వరంగల్ ), జూపల్లి కృష్ణారావు (మహబూబ్ నగర్) మంత్రులుగా ప్రమాణం చేశారు. తెలంగాణలోని శాసన సభ్యుల సంఖ్య ప్రకారం మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి 18 మందికి చేరింది. ఇప్పటికే సీఎంతో కలిపి 12 మంది ఉన్నారు. తాజాగా ఆరుగురికి అవకాశం కల్పించటంతో పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రాజ్‌భవన్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మంత్రివర్గంలో చోటు లభించని వారి అనుచరులు రాజ్‌భవన్ వద్ద నిరసనలు తెలిపే అవకాశం ఉండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని పోలీస్ విభాగాలకు చెందిన బలగాలను రంగంలోకి దించారు. ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో రాజకీయ ప్రముఖులు, అధికారులను, పాస్‌లు కలిగి ఉన్న వారినే అనుమతించారు. -
ఏ పదవి కేటాయించినా న్యాయం చేస్తా:జూపల్లి
హైదరాబాద్:తెలంగాణ కేబినెట్ లో తనకు అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.బంగారు తెలంగాణ సాధన దిశగా అన్ని విధాలా కేసీఆర్ వెంటే ఉంటానన్నారు. ఏ పోర్ట్ పోలియో కేటాయించిన పరిపూర్ణంగా న్యాయం చేస్తానని జూపల్లి తెలిపారు. మంగళవారం జరిగే మంత్రివర్గ విస్తరణలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డికి చోటు దక్కనుంది. టీడీపీ నుంచి ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు బీఎస్పీ తరఫున గెలిచి కొద్ది రోజులకే అధికార పార్టీ గూటికి చేరిన ఇంద్రకరణ్ రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన అజ్మీరా చందూలాల్‌కు మంత్రి పదవులు దక్కనున్నాయి. -
నేడే కెసిఆర్ కేబినెట్ విస్తరణ
-
నేడే కేబినెట్ విస్తరణ.. పురుషులకు మాత్రమే!
* తెలంగాణలో కొత్తగా ఆరుగురికి మంత్రి పదవులు * తుమ్మల, తలసాని, ఇంద్రకరణ్, జూపల్లి, లక్ష్మారెడ్డి, చందూలాల్‌కు అవకాశం * రాజ్‌భవన్‌లో ఉదయం 11 గంటలకు కార్యక్రమం * మంత్రివర్గంలో మహిళలకు అవకాశం లేనట్టే * ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామా చేసే చాన్స్ * మంత్రులు ఈటెల, హరీశ్‌రావుకు అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతలు * కొందరిని స్వయంగా సముదాయించిన సీఎం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారైంది. అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... మంత్రివర్గంలో కొత్తగా ఆరుగురికి చోటు దక్కనుంది. వారితో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డికి అవకాశం లభించనుంది. టీడీపీ నుంచి ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు బీఎస్పీ తరఫున గెలిచి కొద్ది రోజులకే అధికార పార్టీ గూటికి చేరిన ఇంద్రకరణ్ రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన అజ్మీరా చందూలాల్‌కు మంత్రి పదవులు దక్కనున్నట్లు తెలిసింది. వారికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ఫోన్‌చేసి శుభాకాంక్షలు చెప్పినట్లు అధికారవర్గాలు ధ్రువీకరించాయి. అనూహ్య మార్పులేవైనా చోటు చేసుకుంటే తప్ప వీరే కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో కేబినెట్లో మంత్రుల సంఖ్య ముఖ్యమంత్రితో కలిపి 18కి చేరుతుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి రాష్ర్ట మంత్రివర్గ పరిమాణం ఇంతకన్నా మించడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో తాజా విస్తరణలో చివరివరకు ఎలాంటి మార్పులు లేకపోతే ఇక మహిళలకు ప్రాతినిధ్యం లేనట్టే. దీంతో మంత్రి పదవులపై గంపెడాశ పెట్టుకున్న మహిళా ఎమ్మెల్యేలతోపాటు సీనియర్ ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యతను ఆర్థికమంత్రి ఈటెల, భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావుకు సీఎం అప్పగించారు. కొందరితో కేసీఆర్ స్వయంగా మాట్లాడి నచ్చచెబుతున్నారు. ఏ లెక్కలో ఎవరికి చాన్స్? ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కు జలగం వెంకట్రావు ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి అదే జిల్లాకు చెందిన తన సన్నిహితుడు తుమ్మల నాగేశ్వర్రావును కేసీఆర్ టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఖమ్మంతో పాటు హైదరాబాద్‌లోని ‘కమ్మ’ సామాజిక వర్గానికి దగ్గర కావ డానికి ఏ చట్టసభలోనూ సభ్యత్వం లేని తుమ్మలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఇక బలమైన ‘రెడ్డి’ సామాజికవర్గంలో అసంతృప్తిని చల్లబర్చడానికి ఇద్దరు రెడ్డి ఎమ్మెల్యేలకు అవకాశమిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో పాటు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డిని మంత్రివర్గంలో చేర్చుకుంటున్నారు. కాగా, కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తలసానికి అవకాశమిస్తున్నారు. తద్వారా రాజధానిలో బలమైన ‘యాదవ’ సామాజికవర్గానికి దగ్గరవ్వాలని సీఎం భావిస్తున్నారు. ‘వెలమ’ సామాజికవర్గానికి గతంలో ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యం దక్కుతోంది. కేసీఆర్‌తోపాటు ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్‌రావుకు తోడుగా వెలమ వర్గానికి చెందిన మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు తాజాగా అవకాశం లభిస్తోంది. మహిళలకు నో చాన్స్.. రాష్ట్ర కేబినెట్లో మహిళలకు అవకాశం లభించట్లేదు. కనీసం ఒక మహిళకు చోటు ఉంటుందని భావించినా ఏ కారణం వల్లనో ఎవరికీ అవకాశం దక్కడం లేదని తెలుస్తోంది. మంత్రివర్గంలో బెర్తు కోసం కొండా సురేఖ తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం దక్కనట్లు సమాచారం. కేబినెట్లో అవకాశం కోసం గతంలో తీవ్రంగా ప్రయత్నించిన పద్మా దేవేందర్‌రెడ్డికి డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టారు. అనూహ్యంగా సునీత మహేందర్‌రెడ్డికి విప్‌గా అవకాశమిచ్చారు. గిరిజన మహిళా ఎమ్మెల్యే కోవ లక్ష్మికి పార్లమెంటరీ సెక్రటరీగా అవకాశం కల్పిస్తున్నారు. కాగా, మంత్రివర్గంలో చేరే వారి పేర్లు ఇంకా అధికారికంగా వెల్లడికాకపోయినా హైదరాబాద్‌లో తలసాని, తుమ్మల ఫ్లెక్సీలు విస్తృతంగా వెలిశాయి. మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం వస్తుందనుకుంటే చీఫ్ విప్‌గా పరిమితం చేశారని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. కేసీఆర్‌పై, ఆయన నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసంతో, సంతృప్తితో ఉన్నట్టు కొప్పుల ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు. అసంతృప్తి కథనాలన్నీ మీడియా సృష్టేనని వ్యాఖ్యానించారు. నేడు మంత్రివర్గ సమావేశం విస్తరణ అనంతరం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. కొత్త మంత్రులను ఇతర సహచరులకు సీఎం పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు అఖిలపక్ష సమావేశం కూడా జరగనుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూ ఆక్రమణలు, వాటి క్రమబద్దీకరణతోపాటు పాతబస్తీలో మెట్రోరైలు అలైన్మెంట్ మార్పు తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. ఈ నెల 9న జరిగిన అఖిలపక్ష భేటీకి ఇది కొనసాగింపు. రాజ్‌భవన్ వద్ద భారీ బందోబస్తు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం నేపథ్యంలో ముందుజాగ్రత్తగా రాజ్‌భవన్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మంత్రివర్గంలో చోటు లభించని వారి అనుచరులు రాజ్‌భవన్ వద్ద నిరసనలు తెలిపే అవకాశం ఉండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని పోలీస్ విభాగాలకు చెందిన బలగాలను రంగంలోకి దించారు. ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో రాజకీయ ప్రముఖులు, అధికారులను, పాస్‌లు కలిగి ఉన్న వారినే అనుమతించనున్నారు. రాజ్‌భవన్ వద్ద భద్రతా ఏర్పాట్లపై డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సోమవారం సమీక్ష జరిపారు. తలసాని రాజీనామా..! హైదరాబాద్‌లోని సనత్‌నగర్ నుంచి తెలుగుదేశం తరఫున ఎన్నికైన తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఆయన మంగళవారం ఉదయం తన నివాసంలో విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. తలసాని రాజీనామా చేయాలా వద్దా అన్న విషయంలో సోమవారం విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి స్వయంగా న్యాయనిపుణులతో ఈ అంశంపై చర్చించారు. చట్టప్రకారంగా ఎలాంటి ఇబ్బంది లేకపోయినా నైతికంగా మంచిది కాదనే అభిప్రాయం ఈ చర్చల్లో వ్యక్తమైంది. మంత్రిగా ఉంటే కీలకమైన సందర్భాల్లో టీడీపీ విప్ జారీ చేసినప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొవాల్సి వస్తుంద న్న ఉద్దేశంతో చివరకు తలసానితో రాజీనా మా చేయించాలని సీఎం నిర్ణయించారు.