బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: మంత్రి లక్ష్మారెడ్డి
విజయవాడ: ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థులు స్పోర్ట్స్ కోసం అమలాపురం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. గొల్లపూడి సమీపంలోని సురయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి స్పందించి గొల్లపూడిలోని ఆంధ్రా ఆస్పత్రికి ఆయన వెళ్లారు. క్షతగాత్రులను పరామర్శించారు. విద్యార్థులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చెట్టుకు ఢీకొని ఈ ఘటన జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఆరుగురు విద్యార్థులు ఐసీయూలో ఉన్నారని, మరో ఇద్దరు విద్యార్థులకు సర్జరీలు జరిగాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికీ ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని, చనిపోయిన విద్యార్థులను ఆదుకోవడానకి సీఎం కేసీఆర్ తో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. స్పోర్ట్స్ ఈవెంట్ సజావుగానే సాగిందని, చివర్లో ట్రావెల్స్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. వైద్యులు అనుమతి విద్యార్థులను హైదరాబాద్ కు తీసుకొచ్చి చికిత్స అందించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.