
పదేళ్ల అనుభవం ఉందంటూ.. ఢీకొట్టాడు!
విజయవాడ: గొల్లపూడి ప్రమాద ఘటనలో ప్రాణాలతో బయటపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మీడియా సంప్రదించింది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఓ విద్యార్థి మాట్లాడుతూ.. తాను రెండో వరుస సీట్లో కూర్చున్నానని, తన ముందు, పక్కన కూర్చున్న ఇద్దరు చనిపోయారని చెప్పాడు. తన ముందు కొందరు సీనియర్స్ నిల్చున్నారని, వారి వెనకాల తాను రెండో సీట్లో కూర్చున్నా ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపాడు. డ్రైవర్ మద్యం తాగి బస్సు నడుపుతున్నట్లు అనిపించిందని, దానిపై అనుమానంతో కొందరు విద్యార్థులు ట్రావెల్స్ యాజమాన్యానికి ఫోన్ చేస్తే.. డ్రైవర్‌ను మారుస్తామని హామీ ఇచ్చారని.. అయినా మార్చకపోవడంతో సూరయ్యపాలెం వద్ద బస్సును ఆపాలని కోరినా డ్రైవర్ పట్టించుకోలేదని విద్యార్థులు చెబుతున్నారు.
తాము ప్రయాణిస్తున్న ధనుంజయ ట్రావెల్స్ బస్సు గొల్లపూడికి రాగానే డ్రైవర్ కంట్రోల్‌లో లేడని అర్థమయిందన్నాడు. మరో విద్యార్థి మాట్లాడుతూ.. తమ సీనియర్లు డ్రైవర్ ను వేగంగా వెళ్లవెద్దని వారించినా అతడు వినపించుకోలేదని చెప్పాడు. డ్రైవర్ కంట్రోల్ తప్పినట్లు గ్రహించిన సీనియర్స్ ముందుగానే వేరే డ్రైవర్ ను ఏర్పాటుచేసుకున్నారని, కానీ అతడు వచ్చేలోపే ఘోరం జరిగిపోయి తమ కాలేజీ మిత్రులు నలుగురు చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశాడు. బస్సును ఆపాలని సీనియర్లు డ్రైవర్‌ను కోరగా, తనకు పదేళ్ల అనుభవం ఉందంటూ బస్సు వేగాన్ని మరింత పెంచడంతోనే చెట్టును ఢీకొని ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చాడు. తన మిత్రులు మరికొంత మంది పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉందని వివరించాడు.