* తెలంగాణలో కొత్తగా ఆరుగురికి మంత్రి పదవులు
* తుమ్మల, తలసాని, ఇంద్రకరణ్, జూపల్లి, లక్ష్మారెడ్డి, చందూలాల్‌కు అవకాశం
* రాజ్‌భవన్‌లో ఉదయం 11 గంటలకు కార్యక్రమం
* మంత్రివర్గంలో మహిళలకు అవకాశం లేనట్టే
* ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామా చేసే చాన్స్
* మంత్రులు ఈటెల, హరీశ్‌రావుకు అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతలు
* కొందరిని స్వయంగా సముదాయించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారైంది. అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... మంత్రివర్గంలో కొత్తగా ఆరుగురికి చోటు దక్కనుంది. వారితో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డికి అవకాశం లభించనుంది. టీడీపీ నుంచి ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు బీఎస్పీ తరఫున గెలిచి కొద్ది రోజులకే అధికార పార్టీ గూటికి చేరిన ఇంద్రకరణ్ రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన అజ్మీరా చందూలాల్‌కు మంత్రి పదవులు దక్కనున్నట్లు తెలిసింది. వారికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ఫోన్‌చేసి శుభాకాంక్షలు చెప్పినట్లు అధికారవర్గాలు ధ్రువీకరించాయి.
అనూహ్య మార్పులేవైనా చోటు చేసుకుంటే తప్ప వీరే కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో కేబినెట్‌లో మంత్రుల సంఖ్య ముఖ్యమంత్రితో కలిపి 18కి చేరుతుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి రాష్ర్ట మంత్రివర్గ పరిమాణం ఇంతకన్నా మించడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో తాజా విస్తరణలో చివరివరకు ఎలాంటి మార్పులు లేకపోతే ఇక మహిళలకు ప్రాతినిధ్యం లేనట్టే. దీంతో మంత్రి పదవులపై గంపెడాశ పెట్టుకున్న మహిళా ఎమ్మెల్యేలతోపాటు సీనియర్ ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యతను ఆర్థికమంత్రి ఈటెల, భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావుకు సీఎం అప్పగించారు. కొందరితో కేసీఆర్ స్వయంగా మాట్లాడి నచ్చచెబుతున్నారు.
ఏ లెక్కలో ఎవరికి చాన్స్?
ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌కు జలగం వెంకట్రావు ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి అదే జిల్లాకు చెందిన తన సన్నిహితుడు తుమ్మల నాగేశ్వర్‌రావును కేసీఆర్ టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఖమ్మంతో పాటు హైదరాబాద్‌లోని ‘కమ్మ’ సామాజిక వర్గానికి దగ్గర కావ డానికి ఏ చట్టసభలోనూ సభ్యత్వం లేని తుమ్మలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఇక బలమైన ‘రెడ్డి’ సామాజికవర్గంలో అసంతృప్తిని చల్లబర్చడానికి ఇద్దరు రెడ్డి ఎమ్మెల్యేలకు అవకాశమిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో పాటు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డిని మంత్రివర్గంలో చేర్చుకుంటున్నారు.
కాగా, కేవలం జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తలసానికి అవకాశమిస్తున్నారు. తద్వారా రాజధానిలో బలమైన ‘యాదవ’ సామాజికవర్గానికి దగ్గరవ్వాలని సీఎం భావిస్తున్నారు. ‘వెలమ’ సామాజికవర్గానికి గతంలో ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యం దక్కుతోంది. కేసీఆర్‌తోపాటు ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్‌రావుకు తోడుగా వెలమ వర్గానికి చెందిన మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు తాజాగా అవకాశం లభిస్తోంది.
మహిళలకు నో చాన్స్..
రాష్ట్ర కేబినెట్‌లో మహిళలకు అవకాశం లభించట్లేదు. కనీసం ఒక మహిళకు చోటు ఉంటుందని భావించినా ఏ కారణం వల్లనో ఎవరికీ అవకాశం దక్కడం లేదని తెలుస్తోంది. మంత్రివర్గంలో బెర్తు కోసం కొండా సురేఖ తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం దక్కనట్లు సమాచారం. కేబినెట్‌లో అవకాశం కోసం గతంలో తీవ్రంగా ప్రయత్నించిన పద్మా దేవేందర్‌రెడ్డికి డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టారు. అనూహ్యంగా సునీత మహేందర్‌రెడ్డికి విప్‌గా అవకాశమిచ్చారు. గిరిజన మహిళా ఎమ్మెల్యే కోవ లక్ష్మికి పార్లమెంటరీ సెక్రటరీగా అవకాశం కల్పిస్తున్నారు.
కాగా, మంత్రివర్గంలో చేరే వారి పేర్లు ఇంకా అధికారికంగా వెల్లడికాకపోయినా హైదరాబాద్‌లో తలసాని, తుమ్మల ఫ్లెక్సీలు విస్తృతంగా వెలిశాయి. మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం వస్తుందనుకుంటే చీఫ్ విప్‌గా పరిమితం చేశారని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. కేసీఆర్‌పై, ఆయన నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసంతో, సంతృప్తితో ఉన్నట్టు కొప్పుల ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు. అసంతృప్తి కథనాలన్నీ మీడియా సృష్టేనని వ్యాఖ్యానించారు.
నేడు మంత్రివర్గ సమావేశం
విస్తరణ అనంతరం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. కొత్త మంత్రులను ఇతర సహచరులకు సీఎం పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు అఖిలపక్ష సమావేశం కూడా జరగనుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూ ఆక్రమణలు, వాటి క్రమబద్దీకరణతోపాటు పాతబస్తీలో మెట్రోరైలు అలైన్‌మెంట్ మార్పు తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. ఈ నెల 9న జరిగిన అఖిలపక్ష భేటీకి ఇది కొనసాగింపు.
రాజ్‌భవన్ వద్ద భారీ బందోబస్తు
మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం నేపథ్యంలో ముందుజాగ్రత్తగా రాజ్‌భవన్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మంత్రివర్గంలో చోటు లభించని వారి అనుచరులు రాజ్‌భవన్ వద్ద నిరసనలు తెలిపే అవకాశం ఉండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని పోలీస్ విభాగాలకు చెందిన బలగాలను రంగంలోకి దించారు. ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో రాజకీయ ప్రముఖులు, అధికారులను, పాస్‌లు కలిగి ఉన్న వారినే అనుమతించనున్నారు. రాజ్‌భవన్ వద్ద భద్రతా ఏర్పాట్లపై డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సోమవారం సమీక్ష జరిపారు.
తలసాని రాజీనామా..!
హైదరాబాద్‌లోని సనత్‌నగర్ నుంచి తెలుగుదేశం తరఫున ఎన్నికైన తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఆయన మంగళవారం ఉదయం తన నివాసంలో విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. తలసాని రాజీనామా చేయాలా వద్దా అన్న విషయంలో సోమవారం విస్తృతంగా చర్చ జరిగింది.
ముఖ్యమంత్రి స్వయంగా న్యాయనిపుణులతో ఈ అంశంపై చర్చించారు. చట్టప్రకారంగా ఎలాంటి ఇబ్బంది లేకపోయినా నైతికంగా మంచిది కాదనే అభిప్రాయం ఈ చర్చల్లో వ్యక్తమైంది. మంత్రిగా ఉంటే కీలకమైన సందర్భాల్లో టీడీపీ విప్ జారీ చేసినప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొవాల్సి వస్తుంద న్న ఉద్దేశంతో చివరకు తలసానితో రాజీనా మా చేయించాలని సీఎం నిర్ణయించారు.