దేశానికే ఆదర్శంగా పారిశ్రామిక విధానం
పారిశ్రామికవేత్తలూ మాకు ముఖ్యమే: జూపల్లి
పరిశ్రమలకు ఏడాదిలో విద్యుత్ కష్టాలు దూరం: లకా్ష్మరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లకు రాయితీలతో పాటు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కొత్త రాష్ర్ట అభివృద్ధిలో రైతులతో పాటు పారిశ్రామికవేత్తలూ ముఖ్యమేనని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానం దేశానికే ఆదర్శంగా నిలువబోతోందని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్(టాప్సీ), తెలంగాణ పారిశ్రామిక వేత్తల ఫెడరేషన్(టిఫ్)ల సంయుక్త ఆధ్వర్యం లో బుధవారం తెలంగాణలో ఆర్థిక, పారిశ్రామిక, సాంస్కృతిక అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సుమారు 60 వేల ఎంఎస్‌ఎంఈల ద్వారా రాష్ట్రం నుంచి 42 శాతం ఎగుమతులు జరుగుతూ, లక్షలాది మందికి ఉపాధి లభించడం గొప్ప విషయమన్నారు. చిన్న పారిశ్రామికవేత్తలు పెద్ద పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు రావాలని సూచించారు.
పరిశ్రమలకు నీటి సమస్య లేకుండా చూస్తామని, వాటర్‌గ్రిడ్ ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పారు. మూతపడిన పరిశ్రమలను తెరిపించడంతోపాటు, రాష్ర్టంలో ఏ పరిశ్రమకు ఆ పరిస్థితి రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఏడాదిలోపు విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలను, వ్యాపారులను ఇబ్బందికి గురిచేయకుండా పన్ను వసూలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రణాళికసంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు ఎస్. నిరంజన్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి(రెవెన్యూ) వి.శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ పారిశ్రామికవేత్తల ఫెడరేషన్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, ఫ్యాప్సీ అధ్యక్షుడు శివకుమార్ రుంగ్టా, టాప్సీ అధ్యక్షుడు నాగేశ్వర్‌రావు, డిక్కీ అధ్యక్షుడు నరేందర్, కాస్మి అధ్యక్షుడు రాజమహేందర్ రెడ్డి, మహిళా పారిశ్రామికవేత్త సరితా రెడ్డి, నాగేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.