: తెలంగాణ సాంస్కృతిక వేడుక బతుకమ్మ పండుగ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించింది. ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహా బతుకమ్మ వేడుకలో ఒకేసారి 9,292 మంది మహిళలు పాల్గొని రికార్డు సాధించారు. కేరళలో నిర్వహించే ఓనం పండుగ రికార్డును బతుకమ్మ పండుగ బ్రేక్ చేసింది.తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా, ఒలింపిక్స్ రజక పతక విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకల్లో చీరకట్టుతో విచ్చేసిన విదేశీ వనితలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎల్బీ స్టేడియంలో రంగురంగుల పూలతో 20 అడుగుల ఎత్తైన మహా బతుకమ్మను అలంకరించారు. 35 వరుసల్లో మహిళలు బతుకమ్మ చుట్టూ ఆడుతూ సందడి వాతావరణం నెలకొల్పారు. బతుకమ్మ పండుగ శోభతో ఎల్బీ స్టేడియం ప్రాంగణం కళకళలాడింది.