కమెడియన్ వేణుపై దాడిని నిరసిస్తూ జబర్దస్త్ టీమ్తో పాటు టీవీ, సినీ ఆర్టిస్టులు సోమవారం నిరసన తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వరకూ ర్యాలీ చేపట్టారు. తమపై జరిగిన దాడిని నిరసిస్తూ జబర్దస్త్ టీమ్తో పాటు టీవీ, సినీ ఆర్టిస్ట్లు...ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం ఈ ఘటనపై ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నటుడు నాగబాబు మాట్లాడుతూ రెండేళ్లుగా నవ్వులు పండిస్తున్న నటులను కొట్టడం అమానుషమన్నారు. ఏ విపత్తు వచ్చినా కమెడియన్స్గా తమ వంతు సాయంగా ముందుంటున్నామని, అలాంటిది తమపై దాడి చేయటం దారుణమని ధన్రాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఈటీవీలో ప్రసారమౌతున్న 'జబర్దస్త్' షో ఫేం వేణుపై గౌడ కులస్తులు నిన్న ఉదయం దాడి చేసిన విషయం తెలిసిందే. ఈనెల 18న ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్‌ను ప్రదర్శించారని ఆరోపిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన గౌడ విద్యార్థి సంఘం నాయకులు ఫిలింనగర్‌లోని అయ్యప్ప ఆలయానికి వచ్చిన వేణును చుట్టుముట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం కామెడీ కోసమే ఆ స్క్రిప్ట్ తయారు చేశానని, ఒక కులాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని అతను చెప్తుండగానే వారు దాడి చేశారు. జబర్దస్త్ టీమ్, ఈటీవీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో రెండు గంటలపాటు ఫిలించాంబర్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. వేణును ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో కూడా గౌడ విద్యార్థులు అడ్డుపడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వేణు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గౌడ విద్యార్థి సంఘం నేతలపై ఐపీసీ 341, 323 కింద కేసులు నమోదు చే శారు. వేణు కూడా తమపై దాడి చేశాడంటూ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామారావుగౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వేణుపై ఐపీసీ 323, 509కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Published Mon, Dec 22 2014 5:10 PM | Last Updated on Thu, Mar 21 2024 5:25 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement