ఏపీ రాజధాని విజయవాడే | vijayawada-is-the-capital-of-ap-says-chandra-babu | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 22 2014 7:20 AM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానిని కృష్ణా జిల్లా విజయవాడలో ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం పార్టీ నేతల వర్క్‌షాప్‌లో పరోక్షంగా వెల్లడించారు. ఈ వర్క్‌షాప్‌లో రోడ్ గ్రిడ్‌పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘విజయవాడ నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్యలో ఉంది. ఇక్కడి నుంచి కర్నూలు, నంద్యాల మీదుగా బెంగళూరుకు జాతీయ రహదారిని నిర్మించే ప్రతిపాదన చేయాలి’ అని చెప్పారు. సీఎం బుధవారం తన క్యాంపు కార్యాలయం లేక్‌వ్యూ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో రోడ్డు గ్రిడ్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ కేంద్ర బిందువుగానే ఈ రోడ్ గ్రిడ్‌ను అధికారులు రూపొందించారు. ఇదే అంశాన్ని గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలతో కూడిన మ్యాప్‌ను పార్టీ నేతలకు చూపిస్తూ.. ఆయా జిల్లాల నుంచి విజయవాడకు రహదారులను ఎలా విస్తరించాలనుకుంటున్నామో వివరించారు. కర్నూలు, అనంతపురం, కడప తదితర జిల్లాల నుంచి విజయవాడకు త్వరగా చేరాలంటే ఎక్కడి నుంచి రహదారులను నియమిస్తే సులభతరంగా ఉంటుందో కూడా చెప్పారు. ఇలా రాష్ట్రమంతటికీ కేంద్ర బిందువుగా విజయవాడను చూపిస్తూనే రాష్ట్ర రాజధాని ఎక్కడనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కానీ.. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీతో భేటీల్లో విజయవాడ - గుంటూరు ప్రాంతం రాజధానికి అనుకూలంగా ఉంటుందని చంద్రబాబు ప్రతిపాదించటం.. విజయవాడను తాత్కాలిక రాజధానిగా ఎంపిక చేసినట్లు కొద్ది రోజుల కిందట వెల్లడించడం.. అక్కడకు ప్రభుత్వ కార్యాలయాలను వేగంగా తరలించేందుకు కసరత్తు చేస్తుండటం.. తాజాగా విజయవాడ కేంద్ర బిందువుగా రోడ్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించటం.. ఇదంతా రాష్ట్ర రాజధానిగా విజయవాడనే చంద్రబాబు నిర్ణయించారని స్పష్టంచేస్తోందని టీడీపీ నేతలే చెబుతున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, నగరపాలక సంస్థల మేయర్లు, పురపాలక సంఘాల చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో.. ప్రజలు పెట్టుకున్న ఆశలను నెరవేర్చేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్‌లపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రచారం, గ్రిడ్లు, మిషన్లు అనే మూడు అంశాల చుట్టూనే ప్రభుత్వ పాలన సాగుతుందని వివరించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement