చత్తీస్గఢ్ రాష్ట్ర శాసనసభకు తొలి విడత ఓటింగ్ సోమవారం ప్రారంభమైంది. మొత్తం 90 శాసనసభ స్థానాలు ఉండగా తొలి విడతలో 18 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. ఇందుకోసం 4069 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న బస్తర్ ప్రాంతంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల భద్రతకు 80 వేల మంది పారా మిలటరీ బలగాలను మోహరించారు. తొలి విడతలో 143 అభ్యర్థులు రంగంలో ఉండగా, 19 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్ తొలి విడత ఎన్నికల బరిలో ఉన్నారు. రమణ్ సింగ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం కోసం పోరాడుతోంది.