ముగ్గురు రాష్ట్ర మంత్రుల సాక్షిగా భూమి కోసం ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో శుక్రవారం జరిగింది. నిండు సభలో హెయిర్‌డై తాగి బలవన్మరణానికి యత్నించిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ఎంపీలు, ఎమ్మెల్యేలు బెల్లంపల్లి పర్యటనకు వచ్చారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో కొత్తగా నిర్మించిన కార్యాలయ నూతన భవనానికి మంత్రి హరీశ్‌రావు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతుండగా.. బెల్లంపల్లి సుభాష్‌నగర్‌బస్తీకి చెందిన ఆరే వరలక్ష్మి అనే మహిళ సూపర్‌వాస్మల్ 33 హెయిర్‌డైని తాగి పడిపోయింది. పోలీసులు అంబులెన్స్‌లో ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సందర్భంగా బాధితురాలు వరలక్ష్మి ఆస్పత్రిలో విలేకరులతో మాట్లాడింది.