దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతి, మహానేత సతీమణి వైఎస్ విజయమ్మ, రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. వైఎస్ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సమీప బంధువులు, అభిమానులు పెద్ద ఎత్తున వైఎస్ స్మృతివనానికి చేరుకున్నారు. చిత్తూరు, అనంతపురం తదితర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు అక్కడకు వస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృత్యర్థం పార్టీ కార్యకర్తలు జిల్లాలోను, రాష్ట్రవ్యాప్తంగా కూడా పలు కార్యక్రమాలు చేపట్టారు. రోగులకు పండ్లు పంచిపెడుతున్నారు. పార్టీ కార్యాలయాల్లోనూ వైఎస్ జయంతి ఘనంగా జరుగుతోంది.