రాష్ట్రంలో రైతులు, పేదలు, వికలాంగులు, వృద్ధులు, విద్యార్థులు అందరూ ఆనందంగా ఉండాలని, మళ్లీ రాజన్న రాజ్యం రావాలని, జగనన్నతోనే రాజన్న రాజ్యం సాధ్యం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. రాజన్న స్వప్నమే - జగనన్న యజ్ఞం అని చెప్పారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రజా ప్రస్థానం పేరుతో జరుగుతున్న పార్టీ రెండవ ప్లీనరీలో ఆమె ప్రసంగించారు. వైఎస్ జగన్మోహన రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వైఎస్ కుటుంబం తరపున అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి వెళ్లిపోవడం ఈ రాష్ట్రం చేసుకున్న దురదృష్ణం అన్నారు. వైఎస్ఆర్ చనిపోతే బాధపడుతుంది తమ ఒక్క కుటుంబమే కాదని, రాష్ట్రంలోని కోట్ల మంది పేదలు కన్నీరు పెట్టుకుంటున్నారని తనకు తర్వాత తెలిసిందని చెప్పారు. రాజన్న ఆశయ సాధన కోసం జగనన్న కృషి చేస్తున్నారని చెప్పారు. ఇది ధర్మం కోసం, మంచి కోసం చేస్తున్న సమరం అని తెలిపారు. అంతిమ విజయం కోసం అలుపెరుగని పోరాటం చేయాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. నిద్రపోతున్న పౌరుషాన్ని తట్టిలేపాలన్నారు. కాంగ్రెస్ నాయకుల గూబ గుయ్యమనిపించాలని చెప్పారు. ప్రత్యర్థులకు అధికార బలం, కండ బలం, ధన బలం ఉన్నాయి. వారికి లేనిది, మనకు ఉన్నది ప్రజా బలం, దేవుని దయ అని తెలిపారు. నాన్న చనిపోయిన తరువాత తమ కుటుంబాన్ని అవమానించారని చెప్పారు. సిబిఐ పేరుతో కక్షసాధించారు. అమాయకుడైన జగనన్నను జైలు పాలు చేశారని బాధపడ్డారు. ఈ నాలుగేళ్లో అమ్మ ఎంతో నేర్చుకున్నారని, ఆమెలో ఎంతో మార్పు వచ్చిందని తెలిపారు. అంతకు ముందు నాన్నే లోకంగా బతికిన అమ్మేనా అని తనకు అనిపించిందని చెప్పారు. బోనులో ఉన్నా సింహం సింహమేనని జగనన్న నిరూపించుకున్నారన్నారు. అన్న ఇంత నిబ్బరం కలిగినవాడని తనకు కూడా తెలియదని చెప్పారు. అత్యంత శక్తివంతులతో పోరాటం చేస్తున్నట్లు అన్నకు తెలుసు. ఎప్పుడూ జంక కుండా, ఒక్క అడుగు కూడా వెనక్కు వేయకుండా, రాజీపడకుండా పోరాటం చేస్తున్నారని చెప్పారు. దమ్ము, ధైర్యం నిజాయితీ, విశ్వసనీయత ప్రజాధరణతో ముందుకు సాగిపోతున్నట్లు తెలిపారు.
Published Sun, Feb 2 2014 2:46 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement