‘‘అంతా మంచే జరుగుతుంది. ఇక నుంచి మీరు మా కుటుంబమే. ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నాం. మంచి రోజులు మళ్లీ వస్తాయి’’ - అంటూ పరామర్శ యాత్రలో తనను ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటున్న వారికి షర్మిల భరోసా ఇచ్చారు. వరంగల్ జిల్లాలో ఆమె రెండో దశ పరామర్శ యాత్ర గురువారం నాలుగో రోజు నర్సంపేట, పరకాల, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగింది. మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక మరణించిన ఏడుగురి కుటుంబాలను షర్మిల పరామర్శించారు. నర్సంపేటలోని సెయింట్ మేరీ స్కూల్ ఆవరణ నుంచి మొదలై దుగ్గొండి, శాయంపేట, రేగొండ, పరకాల మండలాల్లో 98 కిలోమీటర్ల దూరం యాత్ర జరిగింది. వైఎస్ తనయ, జగన్‌మోహన్‌రెడ్డి సోదరి తమ గ్రామాలకు వస్తోందని తెలియగానే ఆమెను చూసేందుకు ప్రజలు బారులుతీరారు. దారిపొడవునా ఘనస్వాగతం పలికారు. ఆత్మీయంగా ఆదరించారు. తమ ఇంటి మనిషే తిరిగొచ్చినట్టుగా ఆనందపడ్డారు. వైఎస్ మృతితో తమ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయినట్టే అయిందంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘మీ నాయన మాకు చేసిన మేలు మాటల్లో చెప్పలేమమ్మా. పింఛన్లు, ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ వంటి పథకాలతో మాకందరికీ ఆత్మీయుడయ్యాడాయన.