'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ' డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకుల మోముపై నవ్వులు పూయించిన హాస్య నటుడు పృథ్వీరాజ్ ఆస్పత్రిపాలయ్యారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అందులో ఆయన శ్వాస తీసుకోడానికి, మాట్లాడటానికి కూడా తీవ్రంగా కష్టపడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ వీడియోలో పృథ్వీ పది రోజుల నుంచి తీవ్రమైన జలుబు, అనారోగ్యంతో బాధపడుతున్నానని తెలిపారు. అన్నిరకాల పరీక్షలు చేయించుకున్నానని, వాటిలో కోవిడ్ నెగెటివ్ వచ్చిందన్నారు.
అయితే డాక్టర్లు పదిహేను రోజులు క్వారంటైన్ కేంద్రంలో ఉండమన్నారని, వారి సలహా మేరకు నిన్న అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరానని చెప్పుకొచ్చారు. త్వరగా కోలుకునేందుకు ఎదురు చూస్తున్నానన్నారు. ఇందుకోసం అందరి ఆశీస్సులు, వెంకటేశ్వరస్వామి ఆశీర్వాదాలు తనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెబుతూ వీడియో ముగించారు. కాగా తనదైన కామెడీతో సినిమాల్లో బిజీగా ఉండే పృథ్వీరాజ్ గతేడాది పూర్తిగా రాజకీయాల్లో మమేకమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత ఆయన ఎస్వీబీసీ(శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్) చైర్మన్‌గా నియమితులైనప్పటికీ అనివార్య కారణాల వల్ల కొంతకాలానికి ఆ పదవికి రాజీనామా చేశారు.