ఇంటర్ పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో కర్నూలులో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని సీవీ రామన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని నదీమున్నీసాబేగం(18) లెక్చరర్ తిట్టారన్న కారణంతో ఇంటికెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కల్లూరులోని ఎంఎస్ లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్న సుధాకర్‌బాబు, నూర్జహన్‌బేగం దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. సుధాకర్‌బాబు లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మొదటి కూతురు తహెరబాను, రెండో కూతురు నదీమున్నీసాబేగం, మూడో కూతురు హజ్‌మున్నీసా బేగం. వీరిలో తహెరబాను ఎంపీసీ, నదీమున్నీసాబేగం బైపీసీ సీవీ రామన్ జూనియర్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నారు.