‘ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత ఉన్నమాట కొంత వాస్తవం. వరదలతోనే ఇసుక కొరత ఏర్పడింది. ఇసుకలో దోపిడీని అరికట్టి నెలరోజుల వ్యవధిలో మంచి పాలసీ తీసుకువద్దామని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇవేమీ పట్టకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన పవన్ కల్యాణ్ నానాయాగీ చేస్తున్నారు. మనల్ని ఎవరూ పట్టించుకోరనే పరిస్థితిని కార్మికులకు కల్పించారు. వారిద్దరి మాటలతో భవన నిర్మాణ కార్మికులు నైరాశ్యంలో పడిపోయారు’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల తీరుపై విరుచుకుపడ్డారు. లాంగ్ మార్చ్ పేరిట పవన్ కల్యాణ్ వ్యక్తిగత దూషణలకు దిగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ పరిష్కార మార్గాలు చూపించలేదు సరికదా... కార్మికుల సమస్యపై ఆయనకు చిత్తశుద్ది లేదనే విషయం స్పష్టం చేసిందన్నారు.