పోలీస్.. ఈ పదమే వారిని యూనిఫాం వైపు నడిపించింది. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం.. అందరి కల ఒక్కటే. ఖాకీ యూనిఫాం వేసుకుని చట్టాన్ని రక్షించడం. సామాన్యులకు న్యాయం చేయడం. ఇందుకోసం ఎంతో కష్టపడ్డారు. శిక్షణ సైతం పూర్తి చేసుకున్నారు. చివరగా ప్రజా సేవకు సిద్ధమవుతున్నారు. పీటీసీలో శిక్షణ పూర్తి చేసుకున్న 273 మంది ట్రైనీ ఎస్‌ఐల పాసింగ్ అవుట్ పరేడ్ శుక్రవారం నిర్వహించారు.
సాక్షి, అనంతపురం: అనంతపురం పోలీసు ట్రైనింగ్ కళాశాల మరో అపురూప ఘట్టానికి వేదికైంది. శుక్రవారం పీటీసీలో 273 మంది స్టైఫండరీ కేడెట్ ట్రైనీ ఎస్‌ఐల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, గౌరవ అతిథిగా డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. పీటీసీ మైదానంలో ఉదయం 7.40 గంటలకు పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం ప్రారంభం కాగా.. అనంతరం హోంమంత్రి, డీజీపీ గౌరవవందనం స్వీకరించారు. పోలీసు శిక్షణ కళాశాలలో జరిగిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్‌లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్సీలు వెన్నపూసగోపాల్ రెడ్డి, శమంతకమణి, రాయలసీమ ఐజీ నాగేంద్ర కుమార్, డీఐజీలు వెంకట్రామిరెడ్డి, క్రాంతిరాణాటాటా, ఎస్పీ సత్యయేసుబాబు పాల్గొన్నారు.