Trainee SI
-
తండ్రి బదిలీ.. కూతురు బీవీ వర్షకి బాధ్యతలు
కర్ణాటక: ఒక ఎస్ఐ బదిలీ అవుతూ బాధ్యతలను తన కూతురికి అప్పగించారు. ఆమె కూడా ఎస్ఐగా పనిచేస్తుండడం విశేషం. ఈ వినూత్న సంఘటన మండ్యలో జరిగింది. మండ్య సెంట్రల్ పోలీసు స్టేషన్లో ఎస్ఐ బీఎస్ వెంకటేశ్ ఎస్పీ ఆఫీసుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలోకి కొత్త ఎస్ఐగా బీవీ వర్ష నియమితులయ్యారు. ఆమె ఎవరో కాదు.. వెంకటేశ్ కూతురే. తొలి పోస్టింగ్ ఇక్కడే ఎంఏ అర్థశాస్త్రం చదివిన వర్ష 2022 బ్యాచ్‌లో కలబురిగిలో శిక్షణ తీసుకుని ట్రైనీ ఎస్ఐగా ఇదే పీఎస్‌లో పనిచేశారు. తొలి పోస్టింగ్ కూడా మండ్యలోనే జరగడం గమనార్హం. అది కూడా తండ్రి పని చేసి బదిలీ అయిన మండ్య సెంట్రల్ పోలీసు స్టేషన్‌కే. బుధవారం తన తండ్రి వెంకటేశ్ నుంచే వర్ష చార్జ్ తీసుకుని పూర్తిస్థాయి ఎస్ఐగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తండ్రీ కూతురు స్టేషన్‌లోని సిబ్బందికి స్వీట్లు పంచి వేడుక చేసుకున్నారు. -
ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డికి రిమాండ్
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రైనీ మహిళా ఎస్ఐపై అదే పీఎస్‌కు చెందిన ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి లైంగికదాడికి యత్నించిన కేసులో అతన్ని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ నిమిత్తం మహబూబాబాద్ సబ్ జైలుకు పంపినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మీడియాతో ఎస్పీ ఈ కేసు వివరాలు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌రెడ్డిపై ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లు తెలిపారు. విచారణ అధికారిగా తొర్రూరు డీఎస్పీ వెంకటరమణను నియమించామన్నారు. ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిపై ఐపీసీ 354, 354ఏ, 354బి, 354డి, 376(2), 511 ఐపీసీతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వివరించారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, తప్పుచేసిన వారికి తప్పకుండా శిక్షపడుతుందన్నారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలను రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు నివేదిక పంపించనున్నట్లు ఎస్పీ వివరించారు. జిల్లాలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. -
పక్కా పథకం ప్రకారం.. ‘ట్రైనీ ఎస్ఐ’పై ఎస్ఐ లైంగికదాడి!
సాక్షి, వరంగల్ క్రైం/మరిపెడ/మహబూబాబాద్ రూరల్: ఆమె ట్రైనీ ఎస్ఐ.. స్టేషన్‌కు వచ్చి 15 రోజులే అయ్యింది. వచ్చిన నాటి నుంచే ఆమెపై ఆ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కన్నేశాడు. చివరగా లైంగికదాడికి పాల్పడ్డాడు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో మంగళవారం కుటుంబ సభ్యులతో వరంగల్ సీపీని కలసి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన ఉన్నతాధికారులు సదరు ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేస్తూ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకోగా, పోలీస్‌శాఖలో ప్రకంపనలు సృష్టించింది. ట్రైనీ ఎస్ఐ ఫిర్యాదు ఆధారంగా వివరాలిలా ఉన్నాయి. శిక్షణలో భాగంగా మహిళా సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు 15 రోజుల క్రితం మరిపెడ స్టేషన్‌కు వచ్చారు. వచ్చిన నాటి నుంచి ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి ఆమెను లైంగికంగా వేధించసాగాడు. సోమవారం అర్ధరాత్రి పెద్దమొత్తంలో నల్లబెల్లం ఉన్నట్లు సమాచారం వచ్చిందని శ్రీనివాస్‌రెడ్డి సదరు ట్రైనీ ఎస్ఐని వెంటబెట్టుకుని వెళ్లాడు. నిర్జన ప్రదేశానికి వెళ్లిన తర్వాత ఆమెను బలవంతం చేశాడు. కాగా, ఆమె శరీరంపై భౌతికగాయాలు ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ప్రభుత్వం ఎస్హెచ్ఓకు కేటాయించిన వాహనం నడపడానికి డ్రైవర్ ఉంటాడు. కానీ.. అర్ధరాత్రి మారుమూల ప్రాంతంలో నల్లబెల్లం ఉందని, శ్రీనివాసరెడ్డి.. ట్రైనీ ఎస్ఐని మాత్రమే వెంటబెట్టుకొని వెళ్లినట్లు సమాచారం. ఇతర సిబ్బంది ఉన్నా తీసుకెళ్లలేదు. ఇది పక్కా పథకం ప్రకారం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పందించని అధికారులు.. శ్రీనివాసరెడ్డి తీరును ఆ ట్రైనీ ఎస్ఐ మహబూబాబాద్ పోలీస్ అధికారులకు విన్నవించుకున్నట్లు సమాచారం. వారు ఆమె విజ్ఞప్తికి స్పందించకపోగా ‘నీకు ఉజ్వల భవిష్యత్ ఉంది. ఇలాంటి ఫిర్యాదులు ఉద్యోగంలో పనికిరావు. సర్దుకుపోవాలి’ అని చెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె ఉద్యోగం వద్దనుకొని తనకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులకు వివరించి.. వరంగల్ సీపీ తరుణ్ జోషిని కలసి మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నార్త్‌జోన్ ఐజీ, వరంగల్ ఇన్చార్జ్ డీఐజీ నాగిరెడ్డి మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంఘటనపై శాఖాపరమైన విచారణ చేస్తున్నామని సీపీ జోషి పేర్కొన్నారు. విచారణలో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా ట్రైనీ ఎస్ఐ ఎస్సీ కావడంతో శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లల కింద కేసు నమోదైంది. ఎస్ఐని మహబూబాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
రెచ్చిపోయిన ఇసుక స్మగ్లర్లు
మల్లాపూర్ (కోరుట్ల): ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారన్న ఆగ్రహంతో స్మగ్లర్లు ఏకంగా పోలీసులపైనే దాడి చేశారు. రాళ్లు, కర్రలు, పారలతో ట్రైనీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వేంపల్లి శివారు పెద్దవాగులో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రాయికల్ మండలం కొత్తపేట వడ్డెర కాలనీ గ్రామానికి చెందిన కొందరు వేంపల్లి పెద్దవాగులోంచి ఇసుక అక్రమంగా తరలించేందుకు మూడు, నాలుగు రోజులుగా యత్నిస్తున్నారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి 20 ట్రాక్టర్లలో, సుమారు 60 మందికి పైగా స్మగ్లర్లు పెద్దవాగులోకి చేరుకుని ఇసుకను తోడుతున్నారు. సమాచారం అందుకున్న ట్రైనీ ఎస్సై వెంకటేశ్, పోలీస్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రాజ్‌కుమార్ అక్కడకు వెళ్లి రవాణాకు సిద్ధంగా ఉన్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో సుమారు 40 మందికి పైగా దుండగులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ రాళ్లు, కర్రలు, పారలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ట్రైనీ ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రాణ భయంతో పరుగులు తీసిన పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో మెట్పల్లి డీఎస్పీ గౌస్‌బాబా, సీఐ శ్రీనివాస్, సబ్‌డివిజన్ పరిధిలోని ఎస్సైలు, పోలీసులతో వేంపల్లికి చేరుకున్నారు. గాయపడ్డ కానిస్టేబుళ్లకు వైద్యసేవలు అందించారు. అనంతరం ఇసుక ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా పోలీసులపై దాడి చేసిన 24 మందిపై కేసు నమోదు చేశామని, 10 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. ట్రైనీ ఎస్సైపై దాడి జరగలేదని, ఇద్దరు కానిస్టేబుళ్లపై దుండగులు దాడి చేసి గాయపరిచారని సీఐ వివరించారు. -
నీళ్లు అనుకొని శానిటైజర్ తాగిన ఎస్ఐ
సాక్షి, ఒంగోలు: స్థానిక పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ రజాక్ మంచినీరు స్థానే శానిటైజర్ తాగి అస్వస్థతకు గురయ్యారు. స్థానిక కర్నూల్ రోడ్డులోని శ్రీనివాస కాలనీలో నివాసం ఉండే రజాక్ శానిటైజర్ తాగిన వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రోజూ నిద్రలేచిన వెంటనే మంచినీరు తాగడం రజాక్‌కు అలవాటు. ఆ క్రమంలోనే ఆయన శానిటైజర్ కలిసిన నీరు తాగినట్లు ఆలస్యంగా గుర్తించారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రజాక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు తాలూకా సీఐ శివరామకృష్ణారెడ్డి తెలిపారు. (శానిటైజర్ కొంటలేరు...) -
ట్రైనీ ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్
-
ట్రైనీ ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్
పోలీస్.. ఈ పదమే వారిని యూనిఫాం వైపు నడిపించింది. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం.. అందరి కల ఒక్కటే. ఖాకీ యూనిఫాం వేసుకుని చట్టాన్ని రక్షించడం. సామాన్యులకు న్యాయం చేయడం. ఇందుకోసం ఎంతో కష్టపడ్డారు. శిక్షణ సైతం పూర్తి చేసుకున్నారు. చివరగా ప్రజా సేవకు సిద్ధమవుతున్నారు. పీటీసీలో శిక్షణ పూర్తి చేసుకున్న 273 మంది ట్రైనీ ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ శుక్రవారం నిర్వహించారు. సాక్షి, అనంతపురం: అనంతపురం పోలీసు ట్రైనింగ్ కళాశాల మరో అపురూప ఘట్టానికి వేదికైంది. శుక్రవారం పీటీసీలో 273 మంది స్టైఫండరీ కేడెట్ ట్రైనీ ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, గౌరవ అతిథిగా డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. పీటీసీ మైదానంలో ఉదయం 7.40 గంటలకు పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం ప్రారంభం కాగా.. అనంతరం హోంమంత్రి, డీజీపీ గౌరవవందనం స్వీకరించారు. పోలీసు శిక్షణ కళాశాలలో జరిగిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్‌లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్సీలు వెన్నపూసగోపాల్ రెడ్డి, శమంతకమణి, రాయలసీమ ఐజీ నాగేంద్ర కుమార్, డీఐజీలు వెంకట్రామిరెడ్డి, క్రాంతిరాణాటాటా, ఎస్పీ సత్యయేసుబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ.. ప్రజల భద్రత కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారు. ఏపీ పోలీసు వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న ఘనత సీఎం జగన్‌దే. దిశా బిల్లు తీసుకొచ్చి మహిళలకు భద్రత కల్పించారు. దిశ చట్టం ద్వారా 21 రోజుల్లో దోషులకు శిక్ష పడేలా చేశారు. ఏపీలోని అన్ని పోలీసు స్టేషన్లను ఉమెన్ ఫ్రెండ్లీ గా మార్చేశాం' అని అన్నారు. ప్రతిభావంతులకు పురస్కారాలు అనంతపురం పోలీసు ట్రైనింగ్ కళాశాలలో దాదాపు సంవత్సరం పాటు శిక్షణ పొందిన 138 మంది సివిల్ ఎస్ఐలు, 9 నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న 69 మంది ఏఆర్, 66 మంది ఏపీఎస్పీ ఎస్ఐలు పరేడ్‌లో పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరచిన వారికి పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత పురస్కారాలను అందజేశారు. అంతకుముందు వారితో ప్రతిజ్ఞ చేయించారు. డీజీపీ సమావేశం డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉదయం 11.30 నుంచి 12 గంటల సమయంలో డీపీఓలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. జిల్లా పోలీసుల పనితీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం చిత్తూరు, వైస్సార్ కడప జిల్లా పోలీ సులకు రివార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. హోంమంత్రికి ఘన స్వాగతం సాక్షి, అనంతపురం: ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొననున్న హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ సవాంగ్ వేర్వేరుగా గురువారం రాత్రే నగరానికి చేరుకున్నారు. ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద హోంమంత్రికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఐజీ నాగేంద్రకుమార్, ఎస్పీ సత్యయేసుబాబు, జేసీ నిశాంత్‌కుమార్‌లు ఘన స్వాగతం పలికారు. అలాగే వైఎస్సార్సీపీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, గంగుల భానుమతి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు కూడా హోంమంత్రికి బొకేలిచ్చి స్వాగతం పలికారు. -
పీఎస్ ఎదుట ట్రైనీ ఎస్సై భార్య ధర్నా
-
‘నా భర్త వచ్చే వరకు ఇక్కడి నుంచి కదలను’
సాక్షి, గుంటూరు : ప్రేమించి పెళ్లి చేసుకొని కాపురానికి తీసుకెళ్లడం లేదని పీఎస్ ఎదుట ధర్నాకు దిగింది ఓ ట్రైనీ ఎస్సై భార్య. ఈ ఘటన గుంటూరు జిల్లా అచ్చంపేటలో చోటు చేసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు గుంటూరు పీఎస్ ఎదుట బైఠాయించారు. ఆమెను భర్త ఇంట్లోకి రానీవకపోవడంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. తన పేరు లావణ్య అని, రేండేళ్ల క్రితం నెల్లూరు జిల్లా సంగంకు చెందిన నాగార్జున తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్పారు. పెళ్లి అయిన కొద్ది రోజులకే నాగార్జునకు ఎస్సై ఉద్యోగం వచ్చిందని, దీంతో ట్రైనింగ్ అంటూ రెండేళ్లుగా కాపురానికి తీసుకెళ్లలేదని వాపోయారు. ఎన్నిసార్లు అడిగిన ట్రైనింగ్ అంటూ తప్పించుకుతిరుగుతున్నారని చెప్పారు. అచ్చంపేటలో పీఎస్‌లో ట్రైనింగ్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారని తెలుసుకొని ఇక్కడకు వస్తే.. తీవ్రంగా కొట్టి ఇంటికి తాళం వేసుకొని పరారయ్యాడని ఆరోపించారు. ఉద్యోగం రావడంతో తనను వదిలించుకునేందుకు నాగార్జున ప్రయత్నిస్తునారని.. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన భర్త వచ్చి తీసుకెళ్లే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. -
టెక్నాలజీ వినియోగంపై ట్రైనీ ఎస్ఐలకు అవగాహన
అనంతపురం సెంట్రల్: పోలీసు విధుల్లో కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంపై ట్రైనీ ఎస్ఐలకు అవగాహన కల్పించారు. పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పొందుతున్న దాదాపు 300 మంది ఎస్ఐ అభ్యర్థులలో బుధవారం 180 మంది పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని కమాండ్ కంట్రోల్ రూంను సందర్శించారు. పీటీసీ ప్రిన్సిపల్ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ జీవీజీ అశోక్‌బాబు ఆదేశాలకు అధికారులు అవగాహన కల్పించారు. లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టం పనితీరు గురించి వివరించారు. జిల్లా కేంద్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల అదుపు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తదితర సేవల కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, కమాండ్ కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షణ ఎలా చేయవచ్చో తెలిపారు. ఆపదలో ఉన్న వారి కోసం పనిచేస్తున్న డయల్–100 సేవల గురించి తెలియజేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, పోలీస్ కంట్రోల్ రూం సీఐ వహీద్‌ఖాన్, ఆర్ఎస్ఐ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రైనీ ఎస్ఐ కుటుంబానికి పరామర్శ
మిర్యాలగూడ: పట్టణంలోని రవీంద్రనగర్ కాలనీలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ట్రైనీ ఎస్ఐ తమ్మడబోయిన కిరణ్ కుటుంబాన్ని ఆదివారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పరామర్శించారు. కిరణ్ సోదరుడు సల్కునూరు ఎంపీటీసీ తమ్మడబోయిన అర్జున్ను ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైనీ ఎస్ఐ కిరణ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఆయన వెంట మిర్యాలగూడ, తుంగతుర్తి ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, గాదరి కిశోర్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, మండల తహసీల్దార్ మాలి కృష్ణారెడ్డి, నాయకులు నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి తదితరులున్నారు. జూలకంటి పరామర్శ ట్రైనీ ఎస్ఐ తమ్మడబోయిన కిరణ్ కుటుంబాన్ని ఆదివారం సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పరామర్శించారు. అనంతరం ఆత్మహత్యకు గల కారణాలను కిరణ్ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కిరణ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు కిరణ్ భార్యకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, ఆత్మహత్యకు గల కారణాలను పూర్తి స్థాయిలో విచారించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ఆయన వెంట సల్కూనూరు పీఏసీఎస్ చైర్మన్ కందిమళ్ల లక్షా్మరెడ్డి తదితరులున్నారు. -
పోస్టింగ్ ఇవ్వలేదని.. ట్రైనీ ఎస్సై ఆత్మహత్య
⇒ 2015 బ్యాచ్‌కు ఎంపికైన కిరణ్ ⇒ 18 నెలల పాటు శిక్షణ మధ్యలో గాయం కారణంగా 25 రోజులు విరామం ⇒ దాంతో తుది పరీక్షలు నిర్వహించని అధికారులు ⇒ ఆయనతో పాటు శిక్షణ తీసుకున్న మిగతా వారికి పోస్టింగ్ ⇒ ఆవేదనతో తన ఇంట్లో ఉరి వేసుకున్న కిరణ్ ⇒ డెరైక్టర్ వేధింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ మిర్యాలగూడ: శిక్షణ పూర్తయినా తనకు పోస్టింగ్ ఇవ్వలేదని ఓ ట్రైనీ ఎస్సై మనస్తాపం చెందారు. శిక్షణ సమయంలో గాయమై విశ్రాంతి తీసుకున్న కారణంగా తనను పక్కన పెట్టవద్దంటూ అధికారుల చుట్టూ తిరిగారు. ఫలితం లేకపోవడంతో తీవ్రంగా ఆవేదనకు లోనై బలవన్మరణానికి పాల్పడ్డారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం ఈ ఘటన జరిగింది. మిర్యాలగూడ పట్టణంలోని రవీంద్రనగర్ కాలనీకి చెందిన తమ్మడబోయిన మణెమ్మ కుమారుడు కిరణ్ (28). ఆయన 2015లో ఎస్సై ఉద్యోగ అర్హత పరీక్షలో విజయం సాధించి, శిక్షణకు ఎంపికయ్యారు. దాదాపు 18 నెలలుగా హైదరాబాద్‌లోని పోలీస్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. అయితే శిక్షణ సమయంలో బాత్రూంలో సింక్ పగిలి గుచ్చుకోవడంతో కాలికి గాయమైంది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా.. గాయం తగ్గకపోవడంతో స్వగ్రామం మిర్యాలగూడకు వెళ్లి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నారు. గాయం మానిపోయాక వైద్యుల నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకొచ్చి.. పోలీస్ అకాడమీ డెరైక్టర్‌కు అందించి తిరిగి శిక్షణలో చేరారు. శిక్షణ పూర్తికాకపోవడంతో.. అయితే కిరణ్‌తోపాటు శిక్షణ పొందుతున్న అందరికీ తుది పరీక్షలు నిర్వహించి, పోస్టింగ్ ఇచ్చారు. కిరణ్‌కు మాత్రం శిక్షణలో 25 రోజుల విరామం రావడంతో తుది పరీక్షలు నిర్వహించలేదు. తుది పరీక్ష నిర్వహించి, పోస్టింగ్ ఇవ్వాలంటూ కిరణ్ కొంత కాలంగా ఉన్నతాధికారుల చుట్టూ తిరిగారు. కానీ మరో బ్యాచ్‌తో కలిపి పరీక్ష పెడతామని వారు స్పష్టం చేయడంతో తీవ్రంగా మనస్తాపానికి గురయ్యూరు. తిరిగి స్వగ్రామానికి వెళ్లినా ఆవేదనలో మునిగిపోయారు. బుధవారం రాత్రి తన గదిలోని ఫ్యాన్‌కు విద్యుత్ వైర్లతో ఉరి వేసుకున్నారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు తలుపుకొట్టినా స్పందన రాకపోవడంతో.. కిటికీ నుంచి చూసి, ఉరివేసుకున్నట్లుగా గుర్తించారు. కిరణ్‌కు ఏడాదిన్నర క్రితమే సూర్యాపేటకు చెందిన కల్యాణితో వివాహం జరిగింది. వీరికి ఐదు నెలల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే పోలీస్ అకాడమీ డెరైక్టర్ ఈష్‌కుమార్ వేధింపుల కారణంగానే కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నెల రోజుల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చిన కిరణ్.. డెరైక్టర్ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తరచూ ఆందోళన చెందేవాడని చెబుతున్నారు. పోలీసు అకాడమీ డెరైక్టర్ వేధింపుల కారణంగా కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆయన సోదరుడు అర్జున్ ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. -
ట్రైనీ ఎస్సై వీరంగం
బొబ్బిలి : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఎస్సైగా పనిచేస్తున్న జీడీ బాబు సోమవారం రాత్రి వీరంగం సృష్టించారు. భార్య ఫిర్యాదుతో ఇంటికొచ్చి మరీ భర్తను దారుణంగా కొట్టడంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కోరాడవీధిలో నివాసముంటున్న గొర్లె ధనలక్ష్మి తన భర్త అప్పారావు (మాజీ మిలటరీ ఉద్యోగి) రోజూ తాగి వచ్చి తనను, పిల్లలను కొట్టి హింసిస్తుంన్నాడని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ట్రైనీ ఎస్సై జీడీ బాబు నలుగురు కానిస్టేబుళ్లతో కలిసి సోమవారం రాత్రి అప్పారావు ఇంటికి వెళ్లి కర్రలతో చితక్కొట్టారు. దెబ్బలకు అప్పారావు స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికులు అతడ్ని రోడ్డు మీదకు తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు. 27వ వార్డు కౌన్సిలర్ పిల్లా సుజాత, రేజేటి విశ్వేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ పాలవలస ఉమామహేశ్వరరావు, పిల్లా రామారావు, బొద్దల సత్యనారాయణ, మహమ్మద్ రఫీలతో పాటు ఆ వీధికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఎస్సైకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సైను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై నాయుడు వచ్చి ఆందోళన విరమించాలని కోరినా ఆందోళనకారులు శాంతించలేదు. దీంతో సీఐ తాండ్ర సీతారాం సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ట్రైనీ ఎస్సై బాబును తీసుకురావాలని ప్రజలు పట్టుబట్టడంతో సీఐ ఆదేశాల మేరకు పోలీసులు ట్రైనీ ఎస్సైను తీసుకువచ్చారు. ఒక వ్యక్తిని ఇష్టానుసారంగా ఎలా కొడతారని స్థానికులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో సీఐ కలుగజేసుకుని స్టేషన్‌కు వస్తే సమస్య పరిష్కరించుకుందామని నచ్చజెప్పి, బాధితుడు అప్పారావును ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అనంతరం డీఎస్పీ రమణమూర్తి సమక్షంలో చర్చలు జరిపారు. భార్య ఫిర్యాదు మేరకు అప్పారావు ఇంటికి వెళ్లగా అతను తమపై మారణాయుధాలతో దాడి చేయడానికి ప్రయత్నించగా తాము చేయి చేసుకోవలసి వచ్చిందని ట్రైనీ ఎస్సై చెప్పారు. దీనికి స్థానికులు ఒక్కసారిగా ఎదురుతిరగడంతో డీఎస్సీ కలుగజేసుకుని బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని, ఆందోళన విరమించాలని కోరడంతో స్థానికులు శాంతించారు. చర్చల్లో టీడీపీ నాయకుడు తూముల భాస్కరరావు, కాంగ్రెస్ నాయకుడు ఇంటి గోపాలరావు, కౌన్సిలర్లు, స్థానికులు పాల్గొన్నారు. సంఘటన గురించి అప్పారావు భార్య ధనలక్ష్మి వద్ద సాక్షి ప్రస్తావించగా, మిలటరీ ఉద్యోగం కోల్పవడంతో ప్రతి రోజూ తనను, పిల్లలను హింసిస్తున్నాడని, అందుకే ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.