బొబ్బిలి : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ట్రైనీ ఎస్సైగా పనిచేస్తున్న జీడీ బాబు సోమవారం రాత్రి వీరంగం సృష్టించారు. భార్య ఫిర్యాదుతో ఇంటికొచ్చి మరీ భర్తను దారుణంగా కొట్టడంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కోరాడవీధిలో నివాసముంటున్న గొర్లె ధనలక్ష్మి తన భర్త అప్పారావు (మాజీ మిలటరీ ఉద్యోగి) రోజూ తాగి వచ్చి తనను, పిల్లలను కొట్టి హింసిస్తుంన్నాడని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ట్రైనీ ఎస్సై జీడీ బాబు నలుగురు కానిస్టేబుళ్లతో కలిసి సోమవారం రాత్రి అప్పారావు ఇంటికి వెళ్లి కర్రలతో చితక్కొట్టారు. దెబ్బలకు అప్పారావు స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికులు అతడ్ని రోడ్డు మీదకు తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు. 27వ వార్డు కౌన్సిలర్ పిల్లా సుజాత, రేజేటి విశ్వేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ పాలవలస ఉమామహేశ్వరరావు, పిల్లా రామారావు, బొద్దల సత్యనారాయణ, మహమ్మద్ రఫీలతో పాటు ఆ వీధికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఎస్సైకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎస్సైను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై నాయుడు వచ్చి ఆందోళన విరమించాలని కోరినా ఆందోళనకారులు శాంతించలేదు. దీంతో సీఐ తాండ్ర సీతారాం సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ట్రైనీ ఎస్సై బాబును తీసుకురావాలని ప్రజలు పట్టుబట్టడంతో సీఐ ఆదేశాల మేరకు పోలీసులు ట్రైనీ ఎస్సైను తీసుకువచ్చారు. ఒక వ్యక్తిని ఇష్టానుసారంగా ఎలా కొడతారని స్థానికులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో సీఐ కలుగజేసుకుని స్టేషన్‌కు వస్తే సమస్య పరిష్కరించుకుందామని నచ్చజెప్పి, బాధితుడు అప్పారావును ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు.
అనంతరం డీఎస్పీ రమణమూర్తి సమక్షంలో చర్చలు జరిపారు. భార్య ఫిర్యాదు మేరకు అప్పారావు ఇంటికి వెళ్లగా అతను తమపై మారణాయుధాలతో దాడి చేయడానికి ప్రయత్నించగా తాము చేయి చేసుకోవలసి వచ్చిందని ట్రైనీ ఎస్సై చెప్పారు. దీనికి స్థానికులు ఒక్కసారిగా ఎదురుతిరగడంతో డీఎస్సీ కలుగజేసుకుని బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని, ఆందోళన విరమించాలని కోరడంతో స్థానికులు శాంతించారు. చర్చల్లో టీడీపీ నాయకుడు తూముల భాస్కరరావు, కాంగ్రెస్ నాయకుడు ఇంటి గోపాలరావు, కౌన్సిలర్లు, స్థానికులు పాల్గొన్నారు. సంఘటన గురించి అప్పారావు భార్య ధనలక్ష్మి వద్ద సాక్షి ప్రస్తావించగా, మిలటరీ ఉద్యోగం కోల్పవడంతో ప్రతి రోజూ తనను, పిల్లలను హింసిస్తున్నాడని, అందుకే ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.
ట్రైనీ ఎస్సై వీరంగం
Published Wed, Mar 11 2015 2:30 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement