అనంతపురం సెంట్రల్: పోలీసు విధుల్లో కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంపై ట్రైనీ ఎస్‌ఐలకు అవగాహన కల్పించారు. పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పొందుతున్న దాదాపు 300 మంది ఎస్‌ఐ అభ్యర్థులలో బుధవారం 180 మంది పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని కమాండ్ కంట్రోల్ రూంను సందర్శించారు. పీటీసీ ప్రిన్సిపల్ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ జీవీజీ అశోక్‌బాబు ఆదేశాలకు అధికారులు అవగాహన కల్పించారు. లాక్డ్‌హౌస్ మానిటరింగ్ సిస్టం పనితీరు గురించి వివరించారు. జిల్లా కేంద్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల అదుపు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తదితర సేవల కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, కమాండ్ కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షణ ఎలా చేయవచ్చో తెలిపారు. ఆపదలో ఉన్న వారి కోసం పనిచేస్తున్న డయల్–100 సేవల గురించి తెలియజేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, పోలీస్ కంట్రోల్ రూం సీఐ వహీద్‌ఖాన్, ఆర్‌ఎస్‌ఐ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.