శిక్షణలో రాటుదేలాలి
అనంతపురం సెంట్రల్:
శిక్షణలో రాటుదేలి తమ ప్రత్యేకతను చాటుకోవాలని డీజీపీ సాంబశివరావు ట్రైనీ పోలీసు అధికారులకు సూచించారు. రాష్ట్ర పోలీసు శాఖలో సివిల్, కమ్యూనికేషన్స్ విభాగాలకు ఎంపికైన స్టైఫెండరీ కేడెట్ ట్రైనీ ఎస్‌ఐలు, ఫింగర్ ప్రింట్స్ విభాగానికి ఎంపికైన స్టైఫెండరీ కేడెట్ ట్రైనీ ఏఎస్‌ఐలకు శిక్షణ తరగతులను రాష్ట్ర డీజీపీ సాంబశివరావు ప్రారంభించారు. అనంతపురం పోలీసు ట్రైనింగ్ కళాశాలలో 2017 బ్యాచ్‌లో మొత్తం 339 మంది అభ్యర్థులకు సోమవారం నుంచి శిక్షణ మొదలయింది.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. విధుల్లోకి వచ్చిన తర్వాత మీ సామర్థాన్ని చూసి ప్రతి జిల్లా ఎస్పీ గర్వపడాలన్నారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం ఎలా ఏర్పడుతుంది? ఆ సమయంలో మన పాత్ర ఎలా ఉండాలి అనే అంశంపై వివరించారు. నీళ్లు రాలేదని ప్రజలు, ఎరువులు అందలేని రైతులు, కడుపు మండిన ప్రతి ఒక్కరూ రోడ్ల పైకి వచ్చి నిరసన తెలియజేస్తారన్నారు. అలాంటి సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. లా అండ్ ఆర్డర్, సైబర్ క్రైమ్స్, కాల్‌డేటా ఆధారంగా కేసుల దర్యాప్తు తదితర విషయాల్లో పట్టు సాధించాలని తెలిపారు.
అలాగే ఇటీవల సీఐల నుంచి పదోన్నతి పొందిన(సూపర్ నెమోరీ) డీఎస్పీలకు ఎట్టి పరిస్థితిలో లా అండ్ ఆర్డర్ వైపు పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే పదోన్నతులిచ్చి ఇబ్బందులు పడుతున్నామని, మరో సమస్య కొనితెచ్చుకునే ఉద్దేశం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి డీఎస్పీలు 168 మంది ఉన్నారన్నారు. కార్యక్రమంలో ట్రైనింగ్ విభాగం ఐజీలు సంజయ్‌య, రవిచంద్ర, రాయలసీమ రేంజ్ ఐజీ ఎండి ఇక్బాల్, కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీనివాస్, పీటీసీ ప్రిన్సిపాల్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.