- అభ్యర్థులకు డీజీపీ సాంబశివరావు సూచన
- మీ సామర్థ్యం చూసి జిల్లా ఎస్పీ గర్వపడాలి
- భవిష్యత్‌లో విదేశీ తరహా పోలీసింగ్ వ్యవస్థ
- పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారిని గౌరవించండి
- అప్పా తరహాలో ‘అనంత’ పీటీసీ అభివృద్ధి
అనంతపురం సెంట్రల్ : యజ్ఞం వలె శిక్షణ తీసుకుని ప్రొఫెషనల్ పోలీసులుగా తయారు కావాలని డీజీపీ నండూరి సాంబశివరావు సూచించారు. పోలీసుశాఖలో సివిల్, కమ్యూనికేషన్స్ విభాగాలకు ఎంపికైన ఎస్‌ఐలు, ఫింగర్ ప్రింట్స్ విభాగానికి ఎంపికైన ఏఎస్‌ఐలకు సోమవారం అనంతపురంలోని పోలీసు శిక్షణ కళాశాల (పీటీసీ)లో శిక్షణ తరగతులను డీజీపీ ప్రారంభించారు. మొత్తం 339 మంది అభ్యర్థులున్నారని, అందరూ ఉన్నతవిద్యావంతులని (బీటెక్, ఎంటెక్) పీటీసీ ప్రిన్సిపాల్ వెంకట్రామిరెడ్డి వివరించారు. 144 మంది మహిళా అభ్యర్థులున్న ఏకైక బ్యాచ్ ఇది అని వివరించారు. డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ ఇక్కడి పీటీసీలో శిక్షణ తీసుకోవడం ఒక అదృష్టమన్నారు. 1986లో తాను కూడా ఇక్కడే శిక్షణ తీసుకున్నానని గుర్తు చేసుకున్నారు. మళ్లీ డీజీపీ స్థాయిలో ఇక్కడికొచ్చి శిక్షణ అభ్యర్థులతో మాట్లాడే అవకాశం రావడం గర్వంగా ఉందన్నారు. పాసింగ్ అవుట్ పరేడ్ నాటికి ప్రతి ఒక్కరూ ప్రొఫెషనల్ (నిష్ణాతులైన) పోలీసులుగా తయారుకావాలని ఆకాంక్షించారు. విధుల్లోకి వచ్చిన తర్వాత మీ సామర్థాన్ని చూసి ప్రతి జిల్లా ఎస్పీ గర్వపడాలని సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణ మన బాధ్యత
నీళ్లు రాలేదని ప్రజలు, ఎరువులు అందలేని రైతులు, కడుపు మండిన ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతారని, అలాంటి సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంటుందని డీజీపీ సూచించారు. లా అండ్ ఆర్డర్, సైబర్ క్రైమ్స్, కాల్‌డేటా ఆధారంగా కేసుల దర్యాప్తు తదితర విషయాల్లో పట్టు సాధించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ డ్రోన్ కెమెరా, బాడీవార్న్ కెమెరాల వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
భవిష్యత్‌లో విదేశీ తరహాలో పోలీసింగ్ వ్యవస్థలో మార్పులు వస్తాయన్నారు. టెక్నాలజీ ఉపయోగించకపోతే ఎందుకూ పనికిరారని హెచ్చరించారు. పోలీస్‌స్టేషన్‌కు నిరక్షరాస్యుల నుంచి ఎన్‌ఆర్‌ఐ వరకు వస్తారని, ప్రతి ఒక్కరినీ గౌరవించాలని అన్నారు. జీవితంలో క్రమశిక్షణా రాహిత్యం అనేది మంచిది కాదని సూచించారు. అనంతపురం పీటీసీని ఆంద్రప్రదేశ్ పోలీసు అకాడమీ (అప్పా) తరహాలో అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అందులో భాగంగా రూ. 2 కోట్ల నిధులు తక్షణం విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆధునీకరించిన పీటీసీ ఆస్పత్రిని డీజీపీ ప్రారంభించారు. కార్యక్రమంలో ట్రైనింగ్ విభాగం ఐజీలు సంజయ్, రవిచంద్ర, రాయలసీమ రేంజ్ ఐజీ ఎండీ ఇక్బాల్, కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.