16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు జోధ్‌పూర్ ట్రయిల్ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరికి 20 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. కాగా 2013 సంవత్సరం నుంచి జైలు ఊచలు లెక్కిస్తున్న ఆశారాం బాపూపై మూడు అత్యాచార కేసులు నమోదై ఉన్నాయి. 2013 సంవత్సరం ఆగస్టులో పదహారేళ్ల అమ్మాయి జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఆశారాం తనపై లైంగిక దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఆ అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని మభ్యపెట్టిన ఆశారాం ఆమెపై అత్యాచారం జరిపినట్టు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైనప్పటికీ ఆశారాం బాపూ పోలీసుల ఎదుట హాజరు కాలేదు. అందరి కళ్లు గప్పి ఇండోర్‌లోని తన ఆశ్రమంలో దాక్కున్నాడు. నాన్‌బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసినప్పటికీ అతను బయటకి రాలేదు. అతనిని అరెస్ట్ చేయడం కూడా ఒక ప్రహసనంగానే మారింది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆశారాం అనుచరులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు కూడా జరిగాయి.