భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ‘మరణమా నా కెందుకు భయమంటూ’ దివికేగారు. ఇక సెలవంటూ యమునా నది తీరంలోని స్మృతి స్థల్‌లో సేద తీరారు. అశేష జనవాహిని, ప్రియాతి ప్రియమైన బీజేపీ నేతలు, అభిమాన శ్రేణుల తుది నివాళుల మధ్య అటల్‌జీ అంతిమసంస్కారాలు ముగిశాయి. అందరి కన్నీటి వీడ్కోలు మధ్య పూర్తి ప్రభుత్వ అధికార లాంఛనాలతో, హిందూ సంప్రదాయం ప్రకారం మంత్రోచ్ఛారణల మధ్య కర్మయోగి అంత్యక్రియలు ముగిశాయి. వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత భట్టాచార్య ఆయన చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అనంతరం త్రివిధ దళాల అధిపతులు గౌరవ వందనం సమర్పించారు.