రాష్ట్రంలో కొద్ది నెలలుగా బీజేపీపై ఆర్గనైజ్డ్ దుష్ప్రచారం జరుగుతోందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిధులు ఇతర అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి అవాస్తవాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఇటీవలి కాలంలో గుజరాత్ కు సంబంధించి వల్లభాయ్ పటేల్ ప్రాజెక్ట్ కోసం కేంద్రం 3000 కోట్ల రూపాయల మేరకు నిధులు ఇచ్చినట్టు ఒక అబద్ధపు ప్రకటన చేశారని దుయ్యబట్టారు. ఆ ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చింది కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమేనని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో భాగంగా కేంద్రం రూ.1000 కోట్లు నిధులు కేటాయిస్తే ఇప్పటివరకు కేవలం రూ.230 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును వారు తప్పుబట్టారు. అవినీతి సంపాదనపై దృష్టి తగ్గించి చంద్రబాబు ఇకనైనా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. నరేంద్ర మోదీని మళ్లీ ప్రధానమంత్రి కావాలని ఎన్డీఏ పక్షాల తరఫున 2017 ఏప్రిల్ 17న తీర్మానం చేసిన చంద్రబాబు డిసెంబర్ నాటికి తన వైఖరి ఎందుకు మార్చుకున్నారని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి ఎన్నో అబద్దాలకు చంద్రబాబు సమాధానం చెప్పుకోవాల్సి ఉందన్నారు.