సాక్షి , చెన్నై: రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు చెన్నై, కోయంబత్తూరు, మధురై జిల్లాల్లోని నగరాలు, పట్టణాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు సేలం, తిరుప్పూర్‌లో లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. ఆయా రోజుల్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 వరకు లాక్‌డౌన్ అమల్లో కానుంది.
కాగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యే నాలుగు రోజుల సంపూర్ణ లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు కిరాణా, కూరగాయలు, నిత్యావసరాల కోసం క్యూలు కట్టారు. శనివారం ఉదయం నుంచే జనాలు పెద్ద ఎత్తున నిత్యావసరాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో షాపుల వద్ద ప్రజల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ప్రభుత్వం ఓ వైపు భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నా... జనాలు మాత్రం అవేమీ పట్టించుకోకుండా నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు వేలాదిగా తరలి వచ్చారు. ఇదిలా ఉండగా శుక్రవారం 72 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,755కి పెరిగింది. అలాగే మరో ఇద్దరు మృతితో మరణాల సంఖ్య 22కి చేరుకుంది.